శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా

సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్‌ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు.

Updated : 29 Mar 2024 06:20 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్‌ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కండువా కప్పి గోవిందాను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పాలనా విధానాలు నచ్చి, బేషరతుగా ఆయన తమ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో గోవిందా ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా సీనియర్‌ నాయకుడు రామ్‌ నాయక్‌ను ఓడించారు. ఎంపీగా పదవీకాలం ముగిశాక రాజకీయాలకు ఆయన దూరంగా ఉండిపోయారు. శివసేన (శిందే)లో చేరిన సందర్భంగా గోవిందా మాట్లాడుతూ..‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత రాజకీయాల్లోకి మళ్లీ వచ్చా. మోదీ నేతృత్వంలో దేశం నమ్మశక్యం కాని విధంగా అభివృద్ధి చెందుతోంది’’ అన్నారు.


భాజపాలోకి సావిత్రి జిందాల్‌..

చండీగఢ్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి భాజపాలో చేరగా.. ఆయన తల్లి సావిత్రి జిందాల్‌ (84) సైతం గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ల సమక్షంలో ఆమె భాజపాలో చేరారు. ఎమ్మెల్యేగా పదేళ్లు తాను ప్రాతినిథ్యం వహించిన హిసార్‌ నియోజకవర్గ ప్రజల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. హరియాణా రాష్ట్ర మంత్రిగానూ పనిచేసిన సావిత్రి జిందాల్‌ ‘ఫోర్బ్స్‌ ఇండియా’ విడుదల చేసిన జాబితాలో 29.1 బిలియన్‌ డాలర్ల (రూ.2,42,638 కోట్లు) సంపదతో దేశంలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని