భారాసకు భారీ షాక్‌

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

Updated : 29 Mar 2024 13:39 IST

వరంగల్‌ బరి నుంచి వైదొలగిన కడియం కావ్య
కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అవకాశం
హస్తం గూటికి చేరనున్నట్లు ప్రకటించిన కేకే
30న తాను చేరుతున్నానన్న మేయర్‌ విజయలక్ష్మి

ఈనాడు, హైదరాబాద్‌, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

మరోవైపు సీనియర్‌ నాయకుడు భారాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్‌ మేయర్‌ జి.విజయలక్ష్మి భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ఒకేరోజు చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారాసలో కలకలం రేపాయి.

పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్‌కు కావ్య లేఖ

భారాస స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కావ్య పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. ఈ మేరకు ఆమె భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాం వంటివి భారాస ప్రతిష్ఠను దిగజార్చాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా  వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని.. కేసీఆర్‌, భారాస కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే కావ్య హైదరాబాద్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపి.. అంతలోనే బరి నుంచి తప్పుకొంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

పూర్వ పార్టీలోకి వెళతా: కేకే

రాజకీయ విరమణ దశలో ఉన్న తాను.. తిరిగి తన పూర్వపార్టీలో చేరాలనుకుంటున్నట్లు కేకే స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం భారాస అధినేత కేసీఆర్‌తో కేశవరావు భేటీ అయ్యారు. అనంతరం రాత్రి హైదరాబాద్‌లో తన నివాసం వద్ద మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘నేను సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నా. ఆ పార్టీ నాకు అన్ని అవకాశాలూ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల్లో తెరాస(ప్రస్తుత భారాస)లో చేరా. కోరుకున్నట్లుగా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్‌ నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఆయనపై నాకూ గౌరవం ఉంది. భారాస నేతలు, కార్యకర్తలు బాగా సహకరించారు. ఇప్పుడు నేను రాజకీయ విరమణ దశలో ఉన్నా. భారాసలో యువతకు మరిన్ని అవకాశాలు రావాలి. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారు. నేను కూడా నా సొంత ఇల్లులాంటి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకుంటున్నా. 53 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశా. భారాసలో పనిచేసింది పదేళ్లే. నేను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్‌లోనే. భారాసకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌తో చర్చించాను. పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చ జరిగింది. కవిత అరెస్టుపై కూడా మాట్లాడుకున్నాం. ఆమెను అక్రమంగా అరెస్టు చేశారు. భారాసలోనే కొనసాగాలని నా కుమారుడు విప్లవ్‌ తీసుకున్న నిర్ణయం మంచిదే’’ అని కేశవరావు అన్నారు. ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ.. కేకేతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిలను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం అప్పటి నుంచే జరుగుతోంది. తాజాగా గురువారం కేకే నిర్ణయంతో అది ఖరారైంది. తండ్రితో పాటు విలేకరుల ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మేయర్‌ విజయలక్ష్మి తాను ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ‘అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయి. సమస్యలు పరిష్కరించడం సులువు’ అని ఆమె తెలిపారు.

కేసీఆర్‌ నాయకత్వంపై పూర్తి నమ్మకం: విప్లవ్‌కుమార్‌

కేకే కుమారుడు విప్లవ్‌కుమార్‌ తన సోదరి విజయలక్ష్మి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘‘భారాసలో చేరిన తక్కువ సమయంలోనే విజయలక్ష్మికి పార్టీ మంచి అవకాశాలిచ్చింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ను చేసింది. ఆమె మాత్రం భారాసకు వెన్నుపోటు పొడిచారు. పార్టీ మారాలని విజయలక్ష్మి, కేకే తీసుకున్న నిర్ణయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుమార్తె ఒత్తిడి మేరకే మా నాన్న కేకే భారాసను వీడుతున్నారని నమ్ముతున్నా. మా పార్టీ అధినేత కేసీఆర్‌ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. భారాసలోనే కొనసాగుతా’’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

కేకేపై కేసీఆర్‌ అసహనం!

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం భారాస అధినేత కేసీఆర్‌తో కేశవరావు భేటీ అయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు కేసీఆర్‌తో కేకే చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేకే తీరుపై భారాస అధినేత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని.. మీ ఆలోచన మార్చుకోవాలని కేకేకు కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం కేకే తిరిగి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు గురువారం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కేకే నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

భారాసను వీడి.. ఇతర పార్టీల గూటికి చేరి...

ఇప్పటికే పలువురు నేతలు భారాసను వీడి కాంగ్రెస్‌, భాజపాలలో చేరారు. భారాస చేవెళ్ల సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో నిలిచారు. వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు మల్కాజిగిరి టికెట్‌ లభించింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అధికారపార్టీలో చేరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ దక్కించుకున్నారు. జహీరాబాద్‌ భారాస ఎంపీ బీబీపాటిల్‌ భాజపాలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ పి.రాములు భాజపాలో చేరగా.. ఆయన కుమారుడికి టికెట్‌ లభించింది. మాజీ ఎంపీలు జి.నగేశ్‌, అజ్మీరా సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే భాజపా కండువా కప్పుకొన్నారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ హస్తం గూటికి చేరారు. వరంగల్‌ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భారాస కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని