బాలీవుడ్‌, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు

మీ బలహీనతే జగన్‌ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ ఇప్పుడు రూ.200 అయింది.

Updated : 29 Mar 2024 08:23 IST

వివేకా హత్య కేసులో జగన్‌ది రోజుకో అబద్ధం
అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు
46 రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలవుతుంది
రాప్తాడు, శింగనమల, కదిరి ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు


మీ బలహీనతే జగన్‌ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ ఇప్పుడు రూ.200 అయింది. అదనంగా వసూలు చేస్తున్న రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయి. ఈ జలగ మీ రక్తాన్ని తాగుతూనే ఉంటుంది. ఎన్నికల ముందు మద్యనిషేధం అని ఇప్పుడు ఏమొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారో నిలదీయండి. తన ఆదాయం కోసం నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు జగన్‌మోహన్‌రెడ్డి.’’

 తెదేపా అధినేత చంద్రబాబునాయుడు


ఈనాడు డిజిటల్‌, అనంతపురం: సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న నాటకాలు బాలీవుడ్‌, హాలీవుడ్‌ స్థాయిని మించేలా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో జగన్‌ రోజుకో అబద్ధం చెబుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, శింగనమల, కదిరిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘2019 మార్చి 15న సాక్షి టీవీలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులన్నారు. తర్వాత గొడ్డలిపోటు అంటూ నారాసుర రక్తచరిత్ర పేరుతో నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో వార్త ప్రచురించారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్‌మెంట్‌ వివాదమే హత్యకు కారణమన్నారు. బాబాయి హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ కావాలని, అధికారంలోకి వచ్చాక వద్దని కేసు విత్‌డ్రా చేసుకున్నారు. జగన్‌ను నమ్మి మోసపోయానని వివేకా కుమార్తె పోరాటం మెదలుపెడితే.. రెండో వివాహం కారణమని, ఆస్తి కోసం కుమార్తె, అల్లుడే చంపారని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్లు ప్రశ్నిస్తుంటే వారిని నేనే నడిపిస్తున్నానని నాటకాలాడుతున్నారు. సొంత చెల్లెలిపైనే వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. తనను ప్రశ్నించిన వారందరినీ వేధింపులకు గురిచేస్తున్న జగన్‌ ఓ మానసిక రోగి. జగన్‌ సిద్ధంగా ఉండు.. నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కొట్టేరోజు దగ్గర్లోనే ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్‌ అహంకారి, మానసిక రోగి..

‘‘జగన్‌ తానెప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటానని పదేపదే చెబుతుంటారు. ఎందుకంటే.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, పోలవరాన్ని పాతిపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. దారుణమైన రోడ్లు, నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్‌, రైతు ఆత్మహత్యలు, నాసిరకం మద్యం, నిత్యావసరాల పెరుగుదల వంటివి తలుచుకున్న ప్రతిసారీ జగన్‌ గుర్తొస్తారు. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసి... రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్‌. అందరినీ వేధించి ఆనందం పొందుతున్న మానసిక రోగి జగన్‌.. ఒక్కఛాన్స్‌ అని తలపై చేతులు పెట్టి ముద్దులిచ్చిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు కురిపిస్తున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే జలగ జగన్‌. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. రూ.200 ఉన్న బిల్లును రూ.1,000 చేశారు. విద్యుత్తు ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచారు. 2019లో ఫ్యాన్‌కు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు అదే ఫ్యాన్‌కు ఉరివేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయిదేళ్ల తెదేపా ప్రభుత్వంలో ఒకసారి కూడా విద్యుత్తు ఛార్జీలు పెంచలేదు’’ అని తెదేపా అధినేత వివరించారు.

ఏమి కోల్పోయారో ఆలోచించండి

‘‘ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం. అందుకే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. మేము కలిసింది అయిదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం. మహిళల రక్షణ, బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి వస్తున్నాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం మాకు మద్దతివ్వాలని కోరుతున్నాం. నిన్నటి వరకు బెదిరించారు. కేసులు పెట్టారు. ఇప్పుడెవరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్‌ వచ్చింది. మీ ప్రాణాలకు నా ప్రాణమిచ్చి ప్రజానీకాన్ని కాపాడుతా. అయిదేళ్లలో మీరు ఏం కోల్పోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి పేదలను నిరుపేదలుగా చేసిన దుర్మార్గుడి అంతుచూసే సమయం ఆసన్నమైంది’’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

దళితుల గొంతుకోశారు..

‘‘దళితులకు న్యాయం చేస్తానని చెప్పి గొంతుకోసిన వ్యక్తి జగన్‌. తెదేపా ప్రభుత్వంలో 27 పథకాలు తీసుకొస్తే.. అన్నింటినీ రద్దుచేసి దళితులకు ద్రోహం చేశారు. దళితులకు ఎక్కడా స్వాతంత్య్రం లేదు. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్లలో దళితులపై ఆరువేలకుపైగా కేసులు పెట్టారు. 188 మంది దళితులను వేధింపులకు గురిచేసి చంపేశారు. కాకినాడలో దళితుడిని చంపి డోర్‌డెలివరీ చేశారు. సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెదేపా. 1996-97లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబీసీడీ వర్గీకరణ తీసుకొస్తే వాటిని కాపాడలేని వ్యక్తి రాజశేఖరరెడ్డి. వర్గీకరణకు ఇప్పుడు ఎన్డీయే సహకరిస్తోంది. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు న్యాయం చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

మెగాడీఎస్సీపై తొలి సంతకం

‘‘అనంతకు కియా తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం తెదేపా బ్రాండ్‌ అయితే... జాకీ పారిపోయేలా చేయడం, పెట్టుబడులను తరిమేయడం జగన్‌ బ్రాండ్‌. తెదేపా అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే. ఉద్యోగాల్లేకుండా జే బ్రాండ్‌ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ అందుబాటులోకి తెచ్చాడు. దుర్మార్గుడి పాలనలో సమాజం చెడిపోయింది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప ఈ రికార్డు ఎవరూ బ్రేక్‌ చేయలేరు. వైకాపా ప్రభుత్వంలో అందరూ నష్టపోయారు. తెదేపాను గెలిపిస్తే మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’’ అని చంద్రబాబు చెప్పారు.


మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసింది తెదేపానే

‘‘పేదలకు సహాయం చేయాలని ఖురాన్‌ చెబుతుంది. ఆ సిద్ధాంతాన్నే తెలుగుదేశం నమ్ముతుంది. ఎన్డీయేలో వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉర్దూను రెండోభాషగా చేసింది తెదేపానే. హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ, హజ్‌హౌస్‌ ఏర్పాటుచేశారు. మైనారిటీల్లో ఎక్కువశాతం పేదవాళ్లు ఉన్నారని వారికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది నందమూరి తారకరామారావు. రంజాన్‌ తోఫా ఇచ్చాం. మైనారిటీ ఆడపిల్లల వివాహాల కోసం 33వేల మందికి దుల్హాన్‌ పథకం ద్వారా సహాయం చేశాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వైకుంఠం ప్రభాకరచౌదరి, కందికుంట వెంకటప్రసాద్‌, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీవీ వెంకట్రాముడు, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, శింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, పెనుకొండ అభ్యర్థి సవిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని