కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే

కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 05:46 IST

పార్టీ శ్రేణులతో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

రాజమహేంద్రవరం (దేవీచౌక్‌), న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. భాజపా, తెదేపా, జనసేన కూటమి విజయం చారిత్రక అవసరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలో విద్వేష పాలన మొదలైంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. నిరుద్యోగులకు గత అయిదేళ్లలో ఎలాంటి ఉపాధీ కల్పించలేదు. జగన్‌ ప్రభుత్వం ఏకంగా ఎనిమిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచింది. ఇసుక మాఫియా కారణంగా నిర్మాణరంగం కుదేలై 30-40 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు’ అని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. ప్రతి బూత్‌లో కూటమి అభ్యర్థికి గత ఎన్నికల కంటే 300 ఓట్లు ఎక్కువ పడేలా కృషి చేయాలన్నారు. పార్టీ తరఫున ఎవరు నిలబడినా అక్కడి అభ్యర్థి మోదీ అనే భావించాలని నాయకులకు ఆమె సూచించారు. పార్టీ ఏపీ ఎన్నికల సహ బాధ్యుడు సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే పోలవరం ప్రాజెక్టు సాధ్యమని స్పష్టం చేశారు. 

సమావేశానికి సోము వీర్రాజు డుమ్మా

రాజమహేంద్రవరంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్యనాయకుల సమావేశానికి ఆ నగరానికే చెందిన భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశానికీ ఆయన హాజరు కాలేదు. రాజమహేంద్రవరం టికెట్‌ ఆశించినా నిరాశ ఎదురవడంతో సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ఆయన గైర్హాజరీ గురించి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. వీర్రాజు అనారోగ్యంతో బాధపడుతున్నందున సమావేశానికి హాజరు కాలేదని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు