రేపటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.

Published : 29 Mar 2024 05:47 IST

తొలి విడతలో 11 రోజులు, 8 నియోజకవర్గాల్లో ప్రచారం
9న ఉగాది వేడుకలు పిఠాపురంలోనే..

ఈనాడు, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మార్చి 30న ఆయన తొలి విడత ప్రచారం ప్రారంభమవుతుంది. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 11 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. ఇందులో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. మొదటి నాలుగు రోజులు పవన్‌ పిఠాపురంలో నియోజకవర్గంలోనే ఉంటారు. పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారి దర్శించుకుని, వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. మొదట మూడు రోజులే పిఠాపురంలో ఉండాలనుకున్నారు. తాజా పర్యటన షెడ్యూలు ప్రకారం మార్చి 30, 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో ఆయన పిఠాపురంలోనే ఉంటారు. అక్కడ బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్‌తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్‌ 3న పవన్‌ ప్రచారం చేయనున్నారు. మనోహర్‌తో కలిపి సభలో పాల్గొంటారు. రోడ్డు షో నిర్వహణకూ అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రలో 4 రోజుల పర్యటన

అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగు రోజులపాటు జనసేన అధినేత పర్యటిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఏప్రిల్‌ 4న ఆయన పర్యటన ఉంటుంది. ఆ మరునాడు ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 6న అనకాపల్లి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు తిరిగి కాకినాడ జిల్లాకు చేరుకుని, కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు.పవన్‌ ఉగాది రోజున పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండాలని, అక్కడే ఉగాది వేడుకల్లోనూ పాల్గొనాలని నిర్ణయించారు. జనసేన తరఫున విశాఖ దక్షిణం, పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు పోటీచేయాల్సిన అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. విశాఖ దక్షిణం నుంచి ఇప్పటికే ఒక అభ్యర్థికి అనధికారికంగా చెప్పినా తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అభ్యర్థినీ ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితా ప్రకటనకు మరికొంత సమయం తీసుకుంటారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని