‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల

కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ప్రశ్నించారు.

Published : 29 Mar 2024 04:13 IST

పెదకాకాని, న్యూస్‌టుడే: కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం తెదేపా నాయకులు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారని, కక్ష ధోరణిలో భాగంగా వైకాపా నాయకులు ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిస్పక్షపాతంగా పని చేయాల్సిన అధికారులు వైకాపా నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెదకాకాని తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీకి ఛైర్మన్‌గా, డీవీసీ ఆసుపత్రి డైరెక్టర్‌గా ఉన్న తాను, వాటి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నానని.. ఆ పదవుల్లోంచి తనను తొలగించాలని పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఇటీవల ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఆర్వో స్పందించడం దారుణమన్నారు. ప్రభుత్వంతో సంబంధంలేని వ్యవస్థలపై ఫిర్యాదులు ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. అంబటి మురళీకృష్ణ భజరంగ్‌ ఫౌండేషన్‌ సేవలంటూ ప్రజల సమాచారాన్ని తీసుకొని ప్రస్తుతం ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, దానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాంకీ కంపెనీ ఉద్యోగులతో డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేస్తానని.. ఎన్నికల అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని