సంక్షిప్త వార్తలు (7)

ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 29 Mar 2024 06:14 IST

12 ఏళ్లుగా కలిసి ఉన్నా నిర్లక్ష్యమే: అఠావలె

పుణె: ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా కూటమితో కలిసి ఉన్నా నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన కలుగుతోందని పేర్కొన్నారు. తమ పార్టీకి కనీసం రెండు లోక్‌సభ స్థానాలను కోరుతున్నామని తెలిపారు. గురువారం పుణెలో ఆయన మాట్లాడారు. శిర్డీ, శోలాపుర్‌లను తాము కోరామని చెప్పారు. అయితే సీట్ల పంపిణీలో ఆర్‌పీఐ (ఎ) ఎక్కడా కనిపించడంలేదని, కొత్తగా వచ్చిన పార్టీలకు ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.


31న కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీ!

దిల్లీ: పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు.. సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. ఇప్పటివరకు 208 లోక్‌సభ స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.


ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన శివసేన

ముంబయి: ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన గురువారం ఎనిమిది మందిని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపింది. వీరిలో ఇప్పటికే ఎంపీలుగా కొనసాగుతున్న ఏడుగురు ఎంపీలకు మళ్లీ సీట్లు కేటాయించింది. రామ్‌టెక్‌ ఎంపీని పక్కన పెట్టి ఇటీవలే పార్టీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు పార్వేకు టికెట్‌ కట్టబెట్టింది. రాష్ట్రంలో ఎన్నికలు ఏప్రిల్‌ 19న మొదలవనున్నాయి.


ఝార్ఖండ్‌లోని 13 సీట్లలో భాజపా పోటీ

దిల్లీ: ఝార్ఖండ్‌లోని మొత్తం 14 సీట్లలో 13 చోట్ల భాజపా పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా ఒక సీటును ఏజేఎస్‌యూకు కేటాయించింది. గిరిధ్‌ను ఆ పార్టీకి భాజపా కేటాయించింది.


కశ్మీర్‌ బాధను కాంగ్రెసే అర్థం చేసుకోగలదు: ముఫ్తీ

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ అనుభవిస్తున్న బాధను కాంగ్రెస్‌, ముఖ్యంగా రాహుల్‌ గాంధీ మాత్రమే అర్థం చేసుకోగలరని ‘భారత్‌ జోడో యాత్ర’పై శుక్రవారం విడుదల కానున్న పుస్తకంలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. పుస్తకంలో ఆమె ఒక వ్యాసం రాశారు. అందులో ఆమె జమ్మూకశ్మీర్‌ను మినీ ఇండియాగా అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


మండీ నుంచి పోటీకి సిద్ధం
- సిట్టింగ్‌ ఎంపీ ప్రతిభాసింగ్‌ సుముఖత

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీకి విముఖత చూపిన ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు, సిట్టింగ్‌ ఎంపీ ప్రతిభాసింగ్‌ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిభాసింగ్‌.. పార్టీ అధిష్ఠానం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీతో బుధవారం చండీగఢ్‌లో సమావేశమైన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకొని పోటీకి ముందుకు వచ్చారు.


యూపీలో సమాజ్‌వాదీకి షాక్‌

రాంపుర్‌: తొలి విడత నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌ తగిలింది. రాంపుర్‌లో ఆ పార్టీ అభ్యర్థి అసిం రజా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కొన్ని పత్రాలు జతచేయని కారణంగా నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అయితే సమాజ్‌వాదీ తరఫున ముహీబుల్లా నద్వీ కూడా నామినేషన్‌ వేశారు. దీంతో పార్టీ అభ్యర్థిగా నద్వీ బరిలో నిలవనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని