వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య

మాజీ మంత్రి వైఎస్‌ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

Published : 29 Mar 2024 05:26 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకా హంతకుల్ని పక్కనే పెట్టుకొని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు అంటూ సూక్తులు చెబుతారా అని సీఎం జగన్‌పై మండిపడ్డారు. హంతకులెవరో రాష్ట్రమంతా తెలుసునని పేర్కొన్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు అడుగడుగునా అడ్డుపడింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘జగన్‌ అవలీలగా అబద్ధాలు చెప్పగలరు. అధికారంలో ఉండి సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వారిని చట్టం ముందు ఎందుకు నిలబెట్టలేకపోయారు. చంద్రబాబు వేసిన సిట్‌ను ఎందుకు నీరుగార్చారు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఎందుకు వేధించారు.. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఎందుకు కేసు పెట్టించారు.. వివేకా హత్యపై మీ సోదరి షర్మిల ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి’’ అని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరి, హైకోర్టుకు వెళ్లిన జగన్‌.. తీరా సీఎం అయ్యాక ఆ పిటిషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారని నిలదీశారు.

దేవాదాయశాఖ అధికారులకు ఎన్నికల విధులు వద్దు

ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు దేవాదాయశాఖ అధికారుల్ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ప్రత్యేకించి ఆలయాల నిర్వహణ చూసే వారిని దూరంగా ఉంచాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి గురువారం ఆయన లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని