భారాసకు ద్రోహం చేసిన నేతలను క్షమించం

‘భారాసను వీడిన నాయకులను భవిష్యత్తులో దండం పెట్టినా తిరిగి పార్టీలో చేర్చుకోం. పదవులు పొంది, అవకాశాలు తీసుకొని మోసం చేసిన వారిని క్షమించే ప్రసక్తి ఉండదు.

Published : 30 Mar 2024 03:21 IST

ప్రతిపక్షాలను వేధిస్తున్న భాజపా
దొడ్డిదారిన గద్దెనెక్కిన కాంగ్రెస్‌
మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: ‘భారాసను వీడిన నాయకులను భవిష్యత్తులో దండం పెట్టినా తిరిగి పార్టీలో చేర్చుకోం. పదవులు పొంది, అవకాశాలు తీసుకొని మోసం చేసిన వారిని క్షమించే ప్రసక్తి ఉండదు. కొంత మంది స్వార్థపరులు పార్టీ నుంచి వెళ్లిపోయారు. నాయకులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి చేర్చుకుంటారేమో గానీ.. కార్యకర్తలను, ప్రజలను కొనలేరు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేటలో భారాస సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాయకులు, శ్రేణులు తండ్రి లాంటి కేసీఆర్‌కు అండగా నిలవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కుట్రలు పన్నుతూ వేధిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు నమోదు చేస్తోంది. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కేరళ సీఎం కుమార్తె వీణ సహా కేసీఆర్‌ కుమార్తె కవితపై నమోదైన కేసులు అందుకు నిదర్శనం. దేశంలోని భాజపా నేతల్లో ఒక్కరిపైనా ఎందుకు కేసులు నమోదు కాలేదు? మేమూ ఎన్నో ఆలయాలు నిర్మించాం. అయినా దేవుడి పేరుతో ఎన్నడూ రాజకీయాలు చేయలేదు. కాంగ్రెస్‌ పేపర్ల మీద హామీలు రాసి దొడ్డిదారిన గద్దెనెక్కింది. అందులో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. 42.80 లక్షల మంది పింఛనుదారులు, 65 లక్షల మంది రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కింది. ఆ పార్టీ రాకతో రాష్ట్రంలో కరవు వచ్చింది. 180 మంది రైతులు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం సీఎం, మంత్రులు పరామర్శించలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వం పడిపోదు. కానీ మోసం చేస్తే ఓడిపోతామనే భావన వారికి ఓటర్లు కల్పించాలి’ అని హరీశ్‌ కోరారు. ఈ సందర్భంగా ఎల్‌ఈడీ తెరపై ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను ప్రదర్శిస్తూ వివరించారు. సమావేశంలో మెదక్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ, బల్దియా అధ్యక్షురాలు మంజుల, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని