పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబు

దేశంలోనే తెలంగాణ మోడల్‌ పాలన బాగుందని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కితాబివ్వడం మనకు గర్వకారణమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 30 Mar 2024 03:21 IST

పీఈసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
మెజార్టీ లోక్‌సభ సీట్లు గెలిచేందుకు కృషిచేయాలని పిలుపు
ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ఉంది: భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే తెలంగాణ మోడల్‌ పాలన బాగుందని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కితాబివ్వడం మనకు గర్వకారణమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన అధ్యక్షతన జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ రేణుకాచౌదరి, పార్టీ సీనియర్‌ నేతలు జానారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మధుయాస్కీ, వీహెచ్‌, మల్లురవి, వంశీచంద్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, కోదండరెడ్డి, సంపత్‌కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్‌, రోహిత్‌ చౌధరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలిచేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ ఎన్నికల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయి. పార్టీ కోసం కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఏప్రిల్‌ 6వ తేదీ తుక్కుగూడలోని రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జనజాతర సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏఐసీసీ మ్యానిఫెస్టోలోని ఐదు గ్యారంటీ హామీలను ఈ సభలో అగ్రనేతలు ప్రకటిస్తారు. తెలంగాణకు సంబంధించి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన పెండింగ్‌ పనులను మ్యానిఫెస్టోలో చేర్చాలి. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో పార్టీ రాష్ట్ర మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేశాం. సలహాలు ఉంటే ఈ కమిటీకి ఇవ్వాలి’’ అని అన్నారు. దీపా దాస్‌మున్షీ మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం అందరూ కృషిచేయాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, ఎక్కడికెళ్లినా ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ కనిపిస్తోందని చెప్పారు. రైతుబంధు ఇవ్వలేదని ఇతర పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఇప్పటికే  92 శాతం మంది రైతులకు నిధులు పంపిణీ చేసినట్లు భట్టి వివరించారు.

రైతుబంధు సొమ్ము జమపై భారాసతో చర్చకు సిద్ధం: భట్టి

ఐదు ఎకరాల వరకూ భూమి ఉన్న 64.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము వేశామని.. ఇంకా మిగిలిన 5 లక్షల మందికి మాత్రమే వేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయంలో భారాసతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీఈసీ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. భట్టి మాట్లాడుతూ.. ‘‘ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎవరైనా పొరపాట్లు రాసి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ మోడల్‌ గురించి తుక్కుగూడ సభ ద్వారా దేశానికి చాటిచెబుతాం. ఎర్రకోటపై కాంగ్రెస్‌ ప్రభుత్వ జెండాను ఎగరవేసేందుకు నాంది పలికేలా ఈ సభను విజయవంతం చేయాలని పీఈసీ నిర్ణయించింది. రైతులను ఆదుకునే కార్యక్రమాలపై పీఈసీ లోతుగా చర్చించింది. అవసరమైతే ఈసీ అనుమతి కోసం లేఖ రాసి తాగునీటి ఎద్దడిని అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తాం. పొలాలు ఎండిపోయినా చూడలేదని భారాస నేతలు అంటున్నారు.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నిరంతరం రైతులతో మాట్లాడుతూ సమీక్షలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాకే పరిమితమైన భారాస నేతల్లా మేం వ్యవహరించడం లేదు. వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అడ్డగోలు పనులు చేసి ఇప్పుడు తమను ఎవరు ఏం చేయలేరని కేటీఆర్‌ అనడం ఏంటి?’’ అని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మొదటి పంటకే గత వానాకాలంలో భారాస ప్రభుత్వం నీరివ్వలేదని.. ఇప్పుడేమో రెండో పంటకు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సీఎం సమీక్ష జరిపారు. నిజామాబాద్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని