తెలంగాణ సాధనకే నాడు తెరాసలోకి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్‌ను వీడి తెరాస(ప్రస్తుత భారాస)లో చేరానని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు.

Updated : 30 Mar 2024 03:32 IST

రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌.. అందుకే ఇక సొంత గూటికి
అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే
అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్‌ను వీడి తెరాస(ప్రస్తుత భారాస)లో చేరానని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఆ లక్ష్యం నెరవేరడంతో.. 85 ఏళ్ల వయసులో ఇక తిరిగి సొంత గూటికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. అతి త్వరలో దిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్‌లో చేరతానన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు ఇంకా రెండేళ్ల సమయముందని, అవసరమైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్‌ అవకాశమిస్తే తీసుకుంటానని తెలిపారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం కేకే మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయ పార్టీ లేదు. నాకు పదవులపై ఆశ లేదు. కొద్ది రోజులు ఆగాల్సి ఉండేదని కేసీఆర్‌ నాతో చెప్పారు. ఇది రాజకీయ అవకాశవాదమని కొందరు విమర్శిస్తున్నారు. కానీ, నేను చూడని పదవులున్నాయా? కాంగ్రెస్‌ నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. ఈ వయసులో ఇంకా నాకు ఏం పదవులు కావాలి?’’

ఎవరి మనోభావాలైనా నొచ్చుకొని ఉంటే.. క్షమించండి

‘‘తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ అన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఆలోచన మారింది. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందడుగు వేసిందంటే.. ఆ ఘనత కచ్చితంగా కేసీఆర్‌దే. ఇంత అభివృద్ధి చేసినా భారాస ఓడిపోవడం బాధగా ఉంది. దానికి కారణాలు తెలుసుకోవాలి. భారాస నాయకుల్లో ఎంతో మంది తెలివైనవారు ఉన్నారు.అలాంటి వారిని ముందుంచి పార్టీని నడిపిస్తే బాగుంటుందనేది నా భావన. కుటుంబ పాలన అనే అంశం జనాల్లో చర్చకు దారితీసింది. కేసీఆర్‌ నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముగ్గురూ ప్రతిభావంతులే. భారాసను వీడడం పట్ల ఎవరి మనోభావాలైనా నొచ్చుకొని ఉంటే.. దయచేసి నన్ను క్షమించండి. నా కుటుంబంలో చీలికలు సృష్టించవద్దని భారాస నేతలను కోరుతున్నా.

కష్టకాలంలో ఉన్నది కాంగ్రెస్సే

‘‘భారాస కష్టకాలంలో ఉంటే వదిలి వెళ్తున్నానని కొందరు విమర్శిస్తున్నారు. నిజానికి దేశంలో కష్టకాలంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీనే. కేసీఆర్‌ నా సలహా పాటిస్తే ఇండియా కూటమిలో నాయకుడిగా జాతీయ స్థాయిలో ఎదిగేవారు. కాళేశ్వరం, భూకబ్జాలు ఇతర ఆరోపణలపై నా దగ్గర సమాచారం లేదు. ఆ విషయాల్లో నేను నిపుణుడిని కాదు. అందుకే వ్యాఖ్యానించలేను’’ అని కేకే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని