రేవంతూ.. ఐదేళ్లుండు.. 420 హామీలు నెరవేర్చు

ఎన్నికల హామీలపై ప్రశ్నించకుండా ఉండేందుకే సీఎం రేవంత్‌రెడ్డి లీకువీరుడిగా మారారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 30 Mar 2024 06:26 IST

ఎన్నికల హామీలను ప్రశ్నించకుండా ఉండేందుకే లీకు వీరుడిగా మారారు
ఫోన్‌ ట్యాపింగ్‌, గొర్రెలు, బర్రెలు, కాళేశ్వరం స్కాములంటూ దుష్ప్రచారం
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల హామీలపై ప్రశ్నించకుండా ఉండేందుకే సీఎం రేవంత్‌రెడ్డి లీకువీరుడిగా మారారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, గొర్రెలు, బర్రెలు, కాళేేశ్వరంలో స్కాములంటూ తమ పార్టీపై యూట్యూబ్‌ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఐదేళ్లు అధికారంలో ఉండి... ఇచ్చిన 420 హామీలను రేవంత్‌రెడ్డి నెరవేర్చాలి. మేము వారి ప్రభుత్వాన్ని పడగొట్టం. పక్కనే ఉండే నల్గొండ, ఖమ్మం నాయకులే మానవ బాంబులవుతారు. గత ఎన్నికల్లో భారాసను భాజపాకు బీ టీమ్‌ అని ప్రచారం చేశారు.. వాస్తవానికి ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డే భాజపా బీటీమ్‌గా మారతారు. ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదే కాబట్టి నేను పదేపదే చెబుతున్నా. మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓటువేస్తే అది భాజపాకు లాభిస్తుంది. సీఎంగా కాకుండా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. సిటింగ్‌ ఎంపీగా ఉండి మల్కాజిగిరిలో పోటీకి వెనకంజ వేసిన ఆయన రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సీట్లను గెలిపిస్తామని.. భారాసను వంద అడుగుల లోతున పాతిపెడ్తానని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

కాళ్లు పట్టుకున్నా మళ్లీ రానీయం

కేకే, కడియం లాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్లారు. వెళ్లేటప్పుడు నాలుగు రాళ్లు వేసి వెళ్తున్నారు. వారు పెద్దలు..  నేనేమి మాట్లాడను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా.రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డికి కార్యకర్తలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలి. వీరు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానీయం. ఎన్నికల తర్వాత మొదట రంజిత్‌రెడ్డి నాకు ఫోన్‌ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని గెలుద్దామని చెప్పారు. మీడియాకు చెప్పాలని కోరారు. నమ్మి ప్రకటించాను కూడా. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై మహేందర్‌రెడ్డిని అడిగితే ఖండించారు. ఆస్కార్‌ కంటే బాగా నటించారు. చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్‌ కాదు.. కేసీఆర్‌ అన్నట్లుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలి. తుక్కుగూడకు సభకు కాంగ్రెస్‌వాళ్లు కర్ణాటక నుంచి కూడా జనాలను తెప్పిస్తున్నారు. వారు తుక్కుగూడలో నిర్వహించే రాష్ట్ర సభను మించి ఏప్రిల్‌ 13న చేవెళ్లలో నిర్వహించే సభ ఉండాలి. రాష్ట్రంలో 17 స్థానాల్లో రిజర్వు నియోజకవర్గాలు మినహాయించి మిగతా వాటిలో అత్యధికంగా ఆరింటిలో బలహీన వర్గాల అభ్యర్థులనే బరిలోకిదింపాం. గెలిపించండి’’ అని కోరారు.

గెలిచే మొదటి స్థానం చేవెళ్లదే

రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచే మొదటి స్థానం కచ్చితంగా చేవెళ్లదే అని భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తన మనవరాలి పెళ్లికి కార్డు ఇచ్చేందుకు వచ్చి కేసీఆర్‌తో గంటపాటు సమావేశమయ్యారని.. కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు కోసం పనిచేసి మంచి ఆధిక్యం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కేటీఆర్‌ సమావేశంలో తెలిపారు. ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు సబితారెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌, వికారాబాద్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని