ముఖ్యమంత్రి ఇంటికి కేకే.. కడియం నివాసానికి దీపా దాస్‌మున్షీ

భారాసకు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనుండగా.. భారాస ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య త్వరలో చేరనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated : 30 Mar 2024 06:26 IST

నేడు కాంగ్రెస్‌లోకి మేయర్‌ విజయలక్ష్మి

ఈనాడు, హైదరాబాద్‌: భారాసకు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనుండగా.. భారాస ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య త్వరలో చేరనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం కేకే జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌తో తనకు గతంలో సుదీర్ఘ అనుబంధం ఉందని కేకే సీఎంకు గుర్తుచేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌధరి, విష్ణునాథ్‌, ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస నేత మదన్‌రెడ్డి తన అనుచరులతో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. భారాసకు చెందిన నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ఆకుల సుజాత శుక్రవారం గాంధీభవన్‌లో దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆమె అక్కడే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

కడియం సుముఖత: హైదరాబాద్‌లో కడియం శ్రీహరి ఇంటికి దీపా దాస్‌మున్షీ, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు శుక్రవారం వెళ్లి చర్చించారు. కడియంతోపాటు ఆయన కుమార్తె కావ్య కూడా వారితో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరాలని దీపా దాస్‌మున్షీ వారిని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొందరు భారాస నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. దీపా దాస్‌మున్షీ భారాస నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని