రెండు స్థానాలపై స్పష్టత!

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ మరో రెండు నియోజకవర్గాల విషయంలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Published : 30 Mar 2024 03:41 IST

వరంగల్‌కు కడియం కావ్య
ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ మరో రెండు నియోజకవర్గాల విషయంలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కడియం కావ్య పేరుపై నిర్ణయం తీసుకొన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె..  వరంగల్‌ లోక్‌సభ స్థానానికి భారాస  అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో సందిగ్ధానికి తెరపడినట్లయింది. గత కొన్ని రోజులుగా వీరి చేరికపై ప్రచారం జరుగుతున్నా, భారాస అభ్యర్థిగా పోటీ నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు గురువారం రాత్రి కావ్య ప్రకటించడంతో దీనిపై స్పష్టత చేకూరినట్లయింది. శుక్రవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ రాష్ట్ర నాయకులతో కలిసి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా శ్రీహరి పోటీ చేస్తారా లేక ఆయన కుమార్తెనా అన్నదానిపై చర్చ జరుగుతున్నా.. కావ్య పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

హైకమాండ్‌ ఆలోచన ఇలా..

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి విషయంలో ముఖ్యనాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని తన భార్య నందినికి కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.., తన తమ్ముడు ప్రసాదరెడ్డికే ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. మరికొందరు ప్రయత్నించినా చివరకు నందిని, ప్రసాదరెడ్డిలే పోటీలో నిలిచారు. తాను కాంగ్రెస్‌లో చేరేటప్పుడు హామీ ఇచ్చారని, ఈ మేరకు తన సోదరుడికే అవకాశం ఇవ్వాలని పొంగులేటి గట్టిగా ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం మాజీ ఎంపీ ఆర్‌.సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని ఖమ్మం బరిలోకి దింపాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి పార్టీతో ఉన్న కుటుంబమే కాకుండా రఘురామిరెడ్డి.. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు.. ఎవరి కుటుంబ సభ్యులకూ సీటు కేటాయించినట్లు ఉండదు, పొంగులేటికి ఇచ్చిన హామీ మేరకు.. ఆయన సూచించిన వ్యక్తికి సీటు కేటాయించినట్లు ఉంటుందనే అభిప్రాయానికి పార్టీ ముఖ్యులు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం సమయానికి ఇంక ఎలాంటి మార్పులు జరగకుంటే రఘురామిరెడ్డి పేరే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలియవచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ టికెట్‌ ఇవ్వలేకపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి కరీంనగర్‌ లోక్‌సభ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మొదటి నుంచి ఈయన పేరే వినిపిస్తున్నప్పటికీ.., సామాజిక సమీకరణాల్లో వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న పేర్లు కూడా ముందుకు వచ్చాయి. తాజాగా ఓ మాజీ మంత్రిని పోటీ చేయించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కొందరు కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు సదరు మాజీ అమాత్యునితో మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై శనివారం నాటికి ఓ స్పష్టత రానున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని