సంక్షిప్త వార్తలు (3)

వామపక్షాల ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో శనివారం రాష్ట్ర సదస్సు జరగనుంది.

Updated : 30 Mar 2024 06:21 IST

నేడు వామపక్షాల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: వామపక్షాల ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో శనివారం రాష్ట్ర సదస్సు జరగనుంది. ‘కేంద్రంలో భాజపా ప్రభుత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకం’గా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి.


ముంబయిలో ‘ఇండియా’ ఆందోళన

ముంబయి: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమికి చెందిన పార్టీలు శుక్రవారం ముంబయిలో ఆందోళన నిర్వహించాయి. ఆయనను ఈడీ అరెస్టు చేయడం అన్యాయం అంటూ దక్షిణ ముంబయిలోని అజాద్‌ మైదానంలో సత్యాగ్రహం చేపట్టాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని ప్రజలకు పిలపునిచ్చాయి. కార్యక్రమంలో కాంగ్రెస్‌, ఆప్‌, ఎన్సీపీ (శరద్‌చంద్రపవార్‌), సీపీఎం, పీసంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేతలు పాల్గొన్నారు.


మన్మోహన్‌సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు భాజపా క్షమాపణ చెప్పాలి

శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌

ముంబయి: మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో పౌర విమానయాన రంగంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ దాఖలు చేసిన కేసును ఆధారాలు లేక మూసివేసిన నేపథ్యంలో ఆయనకు క్షమాపణలు చెప్పాలని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ భాజపాను డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో ఎయిర్‌ ఇండియా-ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విలీనం సందర్భంగా నేషనల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీఐఎల్‌) ఏర్పడింది. ఈ సంస్థ విమానాల లీజుకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్నారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో దాన్ని మూసివేస్తున్నట్లు ఇటీవలే తుది నివేదిక సమర్పించింది. మన్మోహన్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు భాజపా క్షమాపణలు చెప్పాలని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని