విపక్షాలకు పన్ను పోట్లు

ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో రాజకీయ పార్టీలు తలమునకలవుతుండగా...మరోవైపు వివిధ ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వరుసపెట్టి నోటీసులు పంపిస్తోంది.

Published : 30 Mar 2024 04:48 IST

రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌కు మళ్లీ ఐటీ నోటీసు
దేశవ్యాప్త నిరసనలకు హస్తం పార్టీ పిలుపు

దిల్లీ: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో రాజకీయ పార్టీలు తలమునకలవుతుండగా...మరోవైపు వివిధ ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వరుసపెట్టి నోటీసులు పంపిస్తోంది. తమపై ఐటీ అధికారుల చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టేసిన వెంటనే...2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆ పార్టీకి తాఖీదు అందింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి కూడా ఇదే తరహా నోటీసు వచ్చింది. గత కొన్నేళ్లుగా పన్ను రిటర్నుల దాఖలు సమయంలో పాత పాన్‌ వినియోగించినందుకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలని ఐటీ శాఖ నుంచి షోకాజ్‌ నోటీసు వచ్చిందని ఆ పార్టీ సీనియర్‌ నేత తెలిపారు. అయితే, అంతకుముందు మరో నాయకుడు వెల్లడించినట్లుగా రూ.11 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులో పేర్కొనలేదన్నారు. సీపీఎంకు 2016-17కు సంబంధించి పన్ను మినహాయింపును ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఆ సంవత్సరం పన్ను రిటర్నులో ఒక బ్యాంక్‌ ఖాతా వెల్లడించనందుకు గాను రూ.15.59 కోట్లు పన్ను విధించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. తనకు కూడా 72 గంటల వ్యవధిలో 11 ఐటీ నోటీసులు వచ్చాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే తెలిపారు. ఆదాయపు పన్ను విభాగం చర్యను సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసినట్లు సీపీఎం తెలిపింది. తమకు పంపిన రూ.1,823 కోట్ల ఐటీ డిమాండ్‌ నోటీస్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ స్పష్టంచేయగా....న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు సీపీఐ పేర్కొంది.

ప్రభుత్వం మారితే కఠిన చర్యలు తప్పవు: రాహుల్‌

ఐటీ శాఖ రూ.1,823 కోట్లకు డిమాండ్‌ నోటీసులివ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితరులు ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ భాజపా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికృత చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం మారిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికార పక్షం పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని హస్తం పార్టీ నేతలు జైరాం రమేశ్‌, అజయ్‌ మాకెన్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. వీరు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘ఎన్నికల బాండ్ల స్కాంను ఉపయోగించి భాజపా రూ.8,200 కోట్లు వసూలు చేసింది. దీనికోసం ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌, పోస్ట్‌రెయిడ్‌ ముడుపులు, డొల్ల కంపెనీల వంటి విధానాలను అనుసరించింది. ఆ పార్టీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇదేనా? ఎన్నికల సంఘం ఎందుకు మౌనప్రేక్షకుడిలా ఉంటోందని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓ రాజకీయ పార్టీకి పన్ను నోటీసులు ఇవ్వడం అసాధారణమైన చర్యగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.సి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. దీనిపై శనివారం, ఆదివారం నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని