రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై 1న నిర్ణయం

రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై వచ్చే నెల 1న సమావేశమై జాబితా ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో అదే రోజున నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Published : 30 Mar 2024 04:59 IST

ఆరోజు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నేతల భేటీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై వచ్చే నెల 1న సమావేశమై జాబితా ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో అదే రోజున నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణతో పాటు ఆ పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీపీఎం, సీపీఐలు చెరో రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల చొప్పున పోటీ చేయాలన్న ప్రతిపాదనను షర్మిల ముందుంచారు. ఏ నియోజకవర్గాల్లో అనేది కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ సైతం తమ అభిప్రాయాన్ని తెలిపింది. సుదీర్ఘంగా చర్చించాక ఏప్రిల్‌ 1న విజయవాడలో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ఎన్నికల ప్రచారానికి నేడు శ్రీకారం

‘గడప గడపకు కాంగ్రెస్‌’ పేరుతో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ శనివారం శ్రీకారం చుట్టనుంది. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ హాల్లో ఇందుకు సంబంధించి నిర్వహించే సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని