వైవీపై ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలున్నాయి

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలోని ఇందూ-హౌసింగ్‌ బోర్డు కేసులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తోడల్లుడు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆరోపణలున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 30 Mar 2024 07:05 IST

విల్లాలు కృష్ణప్రసాద్‌ కుమార్తెలు, వైవీ సోదరి, కేవీపీ కోడలు తదితరులకే ఇచ్చారు
కింది కోర్టులో తేల్చుకోవాలన్న తెలంగాణ హైకోర్టు
జగన్‌ అక్రమాస్తుల కేసులో వైవీ పిటిషన్‌ కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలోని ఇందూ-హౌసింగ్‌ బోర్డు కేసులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తోడల్లుడు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆరోపణలున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి హౌసింగ్‌ ప్రాజెక్టులు అప్పగించడంలో వైఎస్‌ను ప్రభావితం చేయడం ద్వారా గచ్చిబౌలి హౌసింగ్‌ ప్రాజెక్టులో 50 శాతం వాటా వైవీకి దక్కిందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందుకుగాను సీబీఐ 48 మంది సాక్షులు, 46 డాక్యుమెంట్లను అభియోగపత్రంతో సహా సీబీఐ కోర్టుకు సమర్పించిందని పేర్కొంది. వైవీ పాత్రపై ఏపీహెచ్‌బీ ఎస్‌ఈ దాట్ల సూర్యానారాయణరాజు, ఈఈ వి.నాగార్జున, వసంత ప్రాజెక్ట్స్‌ ఆర్థిక సలహాదారు గరికపాటి కమలేష్‌, నిమ్మగడ్డ ప్రకాశ్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి.కె.దివాన్‌, యూనిటీ ఇన్‌ఫ్రా ఛైర్మన్‌ కిశోర్‌ కృష్ణారావుల వాంగ్మూలాల్లో సీబీఐ స్పష్టంగా పేర్కొందని తెలిపింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసిన ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లోనే క్రిమినల్‌ కేసు కొట్టివేస్తారని.. అయితే ఇది అలాంటి అరుదైన కేసు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

స్పష్టమైన ఆధారాలున్నందున కింది కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, అందువల్ల వై.వి.సుబ్బారెడ్డి పిటిషన్‌ను అనుమతించలేమంటూ కొట్టివేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వై.వి.సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఇటీవల తీర్పు వెలువరిస్తూ వై.వి.సుబ్బారెడ్డి పిటిషన్‌ను కొట్టివేశారు. గచ్చిబౌలిలో 4.29 ఎకరాల హౌసింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి వసంత ప్రాజెక్ట్స్‌, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వసంత ప్రాజెక్ట్స్‌లో ఇందూ ప్రాజెక్ట్సుకు ఉన్న 51 శాతాన్ని వైవీకి 50 శాతం, కృష్ణప్రసాద్‌కు 1 శాతం కేటాయించారు. దీనికి ప్రతిఫలంగా శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్‌పల్లి హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌లో అదనంగా 15 ఎకరాలను ప్రభుత్వం కేటాయింపు జరిగింది. ఎలాంటి చెల్లింపులు లేకుండా రూ.25.42 కోట్ల ప్రాజెక్టులో వై.వి.సుబ్బారెడ్డి 50 శాతం వాటా పొందారు.

ప్రాథమిక ఆధారాలనే పరిశీలిస్తుంది

కేసును కొట్టివేయాలంటూ నిందితులు పిటిషన్లు దాఖలు చేసినప్పుడు కోర్టు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిశీలిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ సమర్పించిన ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనూప్‌కుమార్‌ శ్రీవాత్సవ కేసులో స్పష్టం చేసిందన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారనడానికి బలమైన కారణం ఉంటే తప్ప జోక్యం చేసుకోలేమన్నారు. ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లోనే అలాంటి ఉత్తర్వులను హైకోర్టు జారీ చేస్తుందన్నారు. ప్రస్తుత కేసులో ప్రాథమిక ఆరోపణలను బలపరిచేలా తగిన సమాచారం ఉందన్నారు. అంతేగాకుండా సీబీఐ సమర్పించిన పత్రాలు తప్ప పిటిషనర్‌ వైవీ అదనంగా ఎలాంటి పత్రాలను సమర్పించలేదన్నారు. కుట్ర ద్వారా లబ్ధి పొందారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

కేవలం ముఖ్యమంత్రి తోడల్లుడన్న కారణంగా కేసు నమోదు చేయడం సరికాదని, దీనికి సంబంధించిన చింతలపాటి శ్రీనివాసరాజు వర్సెస్‌ సెబీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి ప్రస్తావించగా ఆ తీర్పు ఇక్కడ వర్తించదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్కడ కేవలం తోడల్లుడన్న కారణం తప్ప ఎలాంటి ఆధారాలు లేవని, ప్రస్తుత కేసులో వైవీ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వి.వి.కృష్ణప్రసాద్‌, వసంత ప్రాజెక్ట్స్‌లు తమపై కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పులో నిందితుల పాత్రను పేర్కొందన్నారు. కేసును కొట్టివేయడానికి తగిన కారణాలను వైవీ చూపలేదని, అందువల్ల పిటిషన్‌ను కొట్టివేస్తున్నామన్నారు.

వైవీ పాత్రపై ఆరుగురు కీలకమైన సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. ఎంబసీ యూనిటీ కన్సార్షియం పేరుతో కూకట్‌పల్లి, గచ్చిబౌలి హౌసింగ్‌ బోర్డు ప్రాజెక్టులు అనర్హుల (ఇందూ, వసంత)ల చేతికి వెళ్లాయని ఏపీహెచ్‌బీ ఎస్‌ఈ దాట్ల సూర్యానారాయణరాజు వాంగ్మూలం ఇచ్చారు. వసంత గ్రూపు ఆర్థిక సలహాదారుగా ఉన్న గరికపాటి కమలేష్‌ కీలకమైన సమాచారాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని