కాంగ్రెస్‌తో 30 మంది భారాస ఎమ్మెల్యేల సంప్రదింపులు

కాంగ్రెస్‌ గేట్లు తెరవకముందే భారాస నేతలు పార్టీలో చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 30 Mar 2024 05:03 IST

సీఎంగా చేసిన పాపాలే కేసీఆర్‌కు చుట్టుకున్నాయి
‘ట్యాపింగ్‌’పై కేటీఆర్‌ వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలి
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ గేట్లు తెరవకముందే భారాస నేతలు పార్టీలో చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 30 మంది భారాస ఎమ్మెల్యేలు తమపార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఇప్పుడాయనకు చుట్టుకున్నాయని, ఆ పాపాల వల్లే కరవు వచ్చిందని విమర్శించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్‌ చేసిన తప్పని అన్నారు. అక్కడ అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘కేసీఆర్‌పై ప్రజల్లో నమ్మకం పోయింది, కాంగ్రెస్‌పై ఆదరణ పెరిగింది. పార్టీలో కొత్తవారు వచ్చినా పాత నాయకులకు అన్యాయం జరగనివ్వం, అన్ని విధాలా అండగా ఉంటాం. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకునేది లేదు. కేసీఆర్‌ దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు. మూడో టీఎంసీ అవసరం లేకున్నా టెండర్లు పిలిచి రూ.6 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. కేసీఆర్‌ ఏం చేశారని నల్గొండకు వస్తున్నారు? ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని కేటీఆర్‌ ఒప్పుకొన్నారు. ఆయన వ్యాఖ్యలను హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ సుమోటోగా తీసుకుని కఠినంగా శిక్షించాలి. 

కాంగ్రెస్‌-భాజపాల మధ్యనే పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాల మధ్యనే పోటీ ఉంటుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్‌ ఎంపీగా పోటీచేయడం కష్టమేనని అధిష్ఠానం అంటున్నట్లు మీడియాలో చూశాను. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండా మరోపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయనే అభిప్రాయం ఉంది. ఎవరైనా అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలి. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మాకు చెప్పకుండా మా పెద్దన్న కుమారుడు దరఖాస్తు చేశారు.. తెలిశాక వద్దని చెప్పాం. కేకే సాధారణ వ్యక్తి కాదు.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం’’ అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని