విలువల గురించి మాట్లాడే కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారని హనుమకొండ జిల్లా భారాస అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు.

Published : 30 Mar 2024 05:04 IST

మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

ఈనాడు, వరంగల్‌, విద్యానగర్‌, ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారని హనుమకొండ జిల్లా భారాస అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. విలువల గురించి మాట్లాడే కడియం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. శుక్రవారం హనుమకొండలోని భారాస కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర ముఖ్యనేతలతో కలిసి వినయ్‌భాస్కర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘కడియం స్వార్థం వల్ల ఎస్సీలే అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, డాక్టర్‌ విజయరామారావుతోపాటు డాక్టర్‌ రామగళ్ల పరమేశ్వర్‌, దొమ్మాటి సాంబయ్య, ఇటీవల అరూరి రమేశ్‌ లాంటి వారిని ఇలానే బలి చేశారు. కేసీఆర్‌ ఆయనకు అనేక పదవులిస్తే.. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోవడం దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తగిన గుణపాఠం చెబుతాం: ఎమ్మెల్యే పల్లా

ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెదేపాలో ఆనాడు ఎన్టీఆర్‌కు, నేడు కేసీఆర్‌కు, నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ధర్మసాగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని భారాస నాయకులకు కడియం ఫోన్లు చేస్తూ పనులు ఇప్పిస్తానంటూ బేరసారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీని చీల్చాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కడియం శ్రీహరి తీరును విమర్శిస్తూ జిల్లాలో పలుచోట్ల భారాస శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా కార్యాలయంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని