జగన్‌ మెప్పు కోసం ప్రవీణ్‌ప్రకాశ్‌, హేమచంద్రారెడ్డి తాపత్రయం

సీఎం జగన్‌ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ధ్వజమెత్తారు.

Published : 30 Mar 2024 05:04 IST

రూ.వెయ్యి కోట్ల విద్యాశాఖ నిధుల దారి మళ్లింపు
తెదేపా అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సీఎం జగన్‌ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ధ్వజమెత్తారు. విద్యాశాఖకు సంబంధించిన దాదాపు రూ.వెయ్యి కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్‌లు ఆయా వర్సిటీలను కలుషితం చేశారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘గతంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి రూ.400 కోట్లు, రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఇంటర్‌ బోర్డుకు వచ్చిన రూ.230 కోట్లు, విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.110 కోట్లను ప్రభుత్వ పెద్దలు దోచుకున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు చెల్లించిన రూ.75 కోట్లు దారి మళ్లించారు’’ అని పేర్కొన్నారు. ‘‘హేమచంద్రారెడ్డి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారు. విద్యామండలిని ఆ పార్టీ కార్యాలయంలా మార్చారు. అధికార పార్టీ సభలకు విద్యార్థుల్ని పంపాలని ఆయా సంస్థల్ని బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 292 పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. వాటిలో దాదాపు 115 కళాశాలల్లో అడ్మిషన్లూ జరగలేదు. వీటిపై విచారణ చేయాలి’’ అని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని