వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలుసు

మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఎవరు హత్యచేశారో ప్రజలందరికీ తెలుసని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

Published : 30 Mar 2024 05:05 IST

ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఎవరు హత్యచేశారో ప్రజలందరికీ తెలుసని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. రాక్షసంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రించే ప్రయత్నం చేసినా దాని వెనుకున్న వ్యక్తుల గురించి తెలియని అమాయకత్వంలో ప్రజలేమీ లేరని అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యను ఎన్నికల్లో ప్రస్తావించి జగన్‌ తాను అమాయకుడినని ప్రజలను మోసగించే ఎత్తులువేస్తున్నారని, వీటన్నింటినీ సూక్ష్మంగా గమనిస్తున్న ప్రజలు ఆయనకు ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలుగుప్రజల అభిమాననటుడు ఎన్టీఆర్‌ 43 ఏళ్ల క్రితం స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే, వైకాపా రాష్ట్ర విధ్వంస శక్తిగా మిగిలిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించి సేవచేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఆ సమాజాన్ని, ప్రజలను తన దోపిడీకి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.   తెదేపాను ఎన్ని దుష్టశక్తులు బలహీనపరచాలని చూసినా సాధ్యం కాలేదని, వచ్చే ఎన్నికల్లో తెదేపా ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని కనకమేడల ధీమా వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని