అంగన్‌వాడీలకు వైకాపా నగదు ఎర

‘కవర్లో రూ.7 వేలు కాదు.. రూ.70 వేలున్నా నేను తీసుకోను.. మీరు ఈ విధంగా మా ఇంటికొచ్చి ప్రలోభపెట్టడం సరికాదు.. వెళ్లిపోండి’ అంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్త వైకాపా శ్రేణులకు స్పష్టం చేశారు.

Published : 30 Mar 2024 05:05 IST

మంత్రి విడదల రజిని నియోజకవర్గంలో ప్రలోభాలు

గుంటూరు(జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: ‘కవర్లో రూ.7 వేలు కాదు.. రూ.70 వేలున్నా నేను తీసుకోను.. మీరు ఈ విధంగా మా ఇంటికొచ్చి ప్రలోభపెట్టడం సరికాదు.. వెళ్లిపోండి’ అంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్త వైకాపా శ్రేణులకు స్పష్టం చేశారు. వైకాపా అభ్యర్థులు ఇప్పటి వరకు వాలంటీర్లు, ఇతర వర్గాల వారిని ప్రలోభాలకు గురిచేయగా.. ఇప్పుడు అంగన్‌వాడీ సిబ్బందికి నగదు కవర్లను ఎర వేస్తున్నారు. మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇందుకు వేదికైంది. ఆమె అనుచరగణం డివిజన్లలో పర్యటిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించి, ఎండీయూ వాహనాల సిబ్బందికి చేరవేస్తున్నారు. వారు అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, మెప్మా ఆర్పీలకు ఫోన్లు చేసి ఇళ్లకు వెళుతున్నారు. మంత్రి రజిని తరఫున మీకు బహుమతి అంటూ నగదు కవర్లు అందజేస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది వాటిని తీసుకోవడానికి తిరస్కరించినపుడు మీకే కాదు.. అందరికీ ఇస్తున్నామంటూ చెబుతున్నారు. ‘మేడం ఇందులో రూ.7 వేలు ఉన్నాయి.. ఆలోచించుకోండి’ అని ప్రలోభ పెడుతున్నారు. మెప్మా రిసోర్స్‌ పర్సన్ల (ఆర్పీల)కు కూడా నగదు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగదు తీసుకోని వారి వివరాలు నమోదు చేసుకుని ఇబ్బందులు పెడతారేమోనని పలువురు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తున్నా.. అధికార యంత్రాంగం అడ్డుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని