టికెట్‌ దక్కని తెదేపా నేతల నిరసనలు

పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడంతో పాటు, ఇతర కారణాల వల్ల టికెట్లు దక్కని కొందరు తెదేపా నేతలు, వారి మద్దతుదారులు శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Published : 30 Mar 2024 05:05 IST

ఈనాడు, అమరావతి: పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడంతో పాటు, ఇతర కారణాల వల్ల టికెట్లు దక్కని కొందరు తెదేపా నేతలు, వారి మద్దతుదారులు శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి అనంతపురం అర్బన్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు భగ్గుమన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో అధ్యక్షుడి ఛాంబర్‌లోని కుర్చీలు, టేబుల్‌, బీరువా ధ్వంసం చేశారు. కరపత్రాలు, క్యాలెండర్లు రోడ్డుపై వేసి కాల్చేశారు.

  • గుంతకల్లు టికెట్‌ గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడంపై... మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి జితేందర్‌గౌడ్‌ అనుచరులు, మద్దతుదారులు పార్టీ కార్యాలయంలోని కుర్చీలు,  జెండాలు, బ్యానర్లు రోడ్డుపై వేసి తగలబెట్టారు.
  • విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్‌ దక్కకపోవడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున విజయనగరం లోక్‌సభ స్థానం అధ్యక్షపదవికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల తెదేపా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాగార్జున మద్దతుదారులు మూడు రహదారుల కూడలికి ర్యాలీగా చేరుకుని ధర్నా నిర్వహించారు.
  • నెల్లిమర్ల టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. పోలిపల్లిలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
  • పార్టీ తొలి జాబితాలోనే తనకు టికెట్‌ ప్రకటించి, తర్వాత పొత్తులో భాజపాకు  ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం తల్లి, భార్య, బిడ్డలతో కలిసి మహేంద్రవాడలో ఇంటింటికీ వెళ్లి ‘న్యాయం కోసం నల్లమిల్లి’ పేరిట ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. తల్లి నడవలేకపోతే రిక్షాలో కూర్చోబెట్టి ఆయనే తోసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. పార్టీ నాయకులు సుజయకృష్ణ రంగారావు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ తదితరులు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల్ని కలిసి సముదాయించారు. ఆయనకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు.
  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన మద్దతుదారులతో మెళియాపుట్టి నుంచి చాపర వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు టికెట్‌ను తెదేపా అధిష్ఠానం కిల్లు వెంకట రమేష్‌నాయుడుకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. శుక్రవారం సాయంత్రం పాడేరులోని కుమ్మరిపుట్టులో ఆమె అనుచరులు ర్యాలీ నిర్వహించారు. తెదేపా ఫ్లెక్సీలు, కరపత్రాలు తగలబెట్టారు. గిడ్డి ఈశ్వరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి రమేష్‌నాయుణ్ని ఓడిస్తామన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని