కేంద్రంలో మద్దతెవరికో చెప్పాలి

వైకాపా ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని భాజపా, తెదేపా, జనసేన అనకాపల్లి లోక్‌సభ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్‌ డిమాండు చేశారు.

Published : 30 Mar 2024 05:07 IST

వైకాపా ఎంపీ అభ్యర్థులకు సీఎం రమేష్‌ సవాల్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని భాజపా, తెదేపా, జనసేన అనకాపల్లి లోక్‌సభ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్‌ డిమాండు చేశారు. తొలిసారిగా శుక్రవారం అనకాపల్లి వచ్చిన రమేష్‌కు మూడుపార్టీల శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. తనను గెలిపిస్తే విదేశాల నుంచి కంపెనీలను రప్పించి యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం, పరవాడ వంటి సెజ్‌లను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఏర్పాటుచేసేలా చొరవ చూపుతానని వెల్లడించారు. రోడ్లు చూస్తుంటే తనకు భయమేస్తోందన్నారు. ఇలాంటి రోడ్లు మరోచోట ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులను ఇంట్లోనుంచి బయటకు రానీయకుండా ఆందోళనలు చేస్తారన్నారు. ఈ ప్రాంతీయులు సౌమ్యులు కనుక ప్రజాప్రతినిధుల ఆగడాలు సాగుతున్నాయని, తనను గెలిపిస్తే అనకాపల్లిలో సువిశాల రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. తన ప్రత్యర్థి బూడి ముత్యాలనాయుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గానికి రోడ్డు వేయించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ అభ్యర్థులు అయ్యన్నపాత్రుడు, కొణతాల రామకృష్ణ, కేఎస్‌ఎన్‌ రాజు, వంగలపూడి అనిత, పైలా ప్రసాద్‌, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని