లక్షల ఫిర్యాదులు వస్తే.. అవినీతే లేదని ఎలా అంటారు జగన్‌?

‘అవినీతిపై సమాచారం ఇవ్వాలని సీఎం జగన్‌ అనిశా(అవినీతి నిరోధకశాఖ)కు కేటాయించిన ఫోన్‌ నంబరుకు ఐదేళ్లలో 8,03,612 ఫిర్యాదులు వచ్చాయి.

Published : 30 Mar 2024 06:11 IST

మంత్రులు, వారి పేషీలపైనే 2.16 లక్షల ఫిర్యాదులు
జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అవినీతిపై సమాచారం ఇవ్వాలని సీఎం జగన్‌ అనిశా(అవినీతి నిరోధకశాఖ)కు కేటాయించిన ఫోన్‌ నంబరుకు ఐదేళ్లలో 8,03,612 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మంత్రులు, వారి పేషీలపైనే 2,16,803 ఫిర్యాదులు ఉన్నాయి. మరో 4,39,679 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైకాపా నాయకులపై వచ్చాయి. ఇన్ని ఫిర్యాదులు వస్తే.. ఒక్క రూపాయీ అవినీతి జరగలేదని సీఎం జగన్‌ ఎలా ప్రకటించుకుంటారు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. దీనికి జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మనోహర్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘అవినీతి జరగలేదనేది పూర్తి అవాస్తవం. ఐదేళ్లలో ఏం జరిగిందో పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉన్నాయి. కొన్ని శాఖల్లో అవినీతిని జనసేన ప్రజల ముందుకు తెచ్చింది’ అని పేర్కొన్నారు.

ఫిర్యాదులు ఎందుకు దాస్తున్నారు..?

‘పింఛను, రేషన్‌ అందడంలేదని ఫిర్యాదు చేస్తేనే వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. అయినప్పటికీ అనిశాకు ఇన్ని లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఆర్థికశాఖలో రూ.91 వేల కోట్లు ఎటు వెళ్లాయో నేటికీ తెలియదు. ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్లు, విద్యార్థులకు ఇచ్చిన షూ, బ్యాగుల్లో రూ.120 కోట్లు, జగనన్న కాలనీల పేరుతో రూ.34 వేల కోట్లు దోచేశారు. రూ.2,859 కోట్లతో 4,170,00 గేదెలను కొన్నామన్నారు. కానీ ఎవరికీ లబ్ధి చేకూరలేదు. ఇదంతా అవినీతి కాకపోతే ఏమిటి?’ అని ప్రశ్నించారు. ‘తన అవినీతికి సహకరించాలని ఓ మంత్రి.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్‌ ఇచ్చారు. మరో మంత్రి ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను సొంత గ్రామానికి బదిలీ చేయిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసి, రూ.15 లక్షలు ఇచ్చిన మరొకరిని ఆ స్థానానికి బదిలీ చేశారు. మంత్రుల వ్యవహారంపై అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అనిశా అధికారులు ఏటా వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై గణాంకాలు విడుదల చేయాల్సి ఉంటుంది. జగన్‌ సీఎం అయ్యాక ఒక్క సారీ వెల్లడించలేదు. అధికారులు తక్షణమే ఫిర్యాదులను బహిర్గతం చేయాలి’ అని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని