రాజకీయమంటే ప్రజాసేవ అని చాటింది తెదేపానే

రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని చాటిచెప్పింది తెలుగుదేశమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Published : 30 Mar 2024 05:39 IST

బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది
పార్టీ అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని చాటిచెప్పింది తెలుగుదేశమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పిందని గుర్తు చేశారు. శుక్రవారం తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలకు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టిశ్రీరాములు, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే వంటి మహాశయుల స్ఫూర్తితో 1982 మార్చి 29న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులిచ్చారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాం. ఇక ముందూ ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


రాష్ట్ర పునర్నిర్మాణం తెదేపాతోనే సాధ్యం
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

తెలుగుజాతి ఆత్మగౌరవం, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించి.. వారికి రాజ్యాధికారం కల్పించిన పార్టీ తెదేపా. నేడు జగన్‌ విధ్వంసకర పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం తెదేపాకే సాధ్యం.


తెదేపా కేంద్ర కార్యాలయంలో వేడుకలు

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన తెదేపా ఆవిర్భావ వేడుకల్లో ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు.


తెదేపా అవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు

కదిరి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అధినేత చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభ నిర్వహించేందుకు గురువారం అధినేత కదిరికి వచ్చారు. బస చేసిన పీవీఆర్‌ గ్రాండ్‌ వద్ద ఉదయం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కేకు కోసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని