భాజపా ఎన్నికల కార్యాచరణ వేగవంతం

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాచరణను వేగవంతం చేయాలని భాజపా నిర్ణయించింది. సమీక్షా సమావేశాలతో నేతల సమన్వయం, ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాలనే అభిప్రాయానికి వచ్చింది.

Published : 30 Mar 2024 05:09 IST

నేడు అభయ్‌ పటేల్‌ రాక

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాచరణను వేగవంతం చేయాలని భాజపా నిర్ణయించింది. సమీక్షా సమావేశాలతో నేతల సమన్వయం, ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాలనే అభిప్రాయానికి వచ్చింది. ఇప్పటికే ప్రారంభించిన లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భాజపా లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌ పటేల్‌ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణను అభయ్‌ పటేల్‌ పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల కమిటీ విభాగాలతో నేతల భేటీ..

భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌లు ఎన్నికల నిర్వహణ కమిటీ విభాగాలతో సమావేశమై వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సన్నద్ధత సమావేశాలపై చర్చించారు. శనివారం వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చంద్రశేఖర్‌తో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, అభ్యర్థులు ఆరూరి రమేశ్‌, సీతారాం నాయక్‌లు పాల్గొంటారు.

కంటోన్మెంట్‌ అభ్యర్థి ఎంపికపై కసరత్తు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై భాజపా దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై భాజపా కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేశ్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించే దిశగా భాజపా దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని