దళితులు నాయకత్వ స్థానంలో ఉండకూడదనే వైకాపా కుట్ర

జగన్‌ రెండు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశ పడుతున్నప్పుడు మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన తాను ఎంపీగా ఉండటానికి, ప్రజాసేవ చేసేందుకు అర్హుడిని కానా అని తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు ప్రశ్నించారు.

Published : 30 Mar 2024 05:09 IST

ఎంపీగా ఉండేందుకు ఓ మాజీ ఐఏఎస్‌ అర్హుడు కాదా?
తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-బైరాగిపట్టెడ: జగన్‌ రెండు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశ పడుతున్నప్పుడు మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన తాను ఎంపీగా ఉండటానికి, ప్రజాసేవ చేసేందుకు అర్హుడిని కానా అని తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు ప్రశ్నించారు. వైకాపాలో దళితులు ఏఒక్కరూ రెండోసారి పోటీలో ఉండే అవకాశం లేదని, ఈసారి 29 శాసనసభ స్థానాలకు 27 మంది ఎస్సీ అభ్యర్థులను మార్చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుపతిలో భాజపా-జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘జగన్‌ జైల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యనేతలు ఎవరూ అండగా లేనప్పుడు పార్టీలో చేరా. 2014లో గెలిచిన తక్కువమందిలో నేనూ ఒకడిని. ప్రత్యేకహోదా కోసం లోక్‌సభ లోపల, బయట దీక్షలు, రాజీనామాలు చేయమంటే చేశాం. నేను ప్రజల్లోకి వెళ్తున్నందునే కొందరికి ప్రాధాన్యం తగ్గుతుందన్న ఉద్దేశంతో సమర్థుడైన నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పంపించారు. ఈ విషయమై సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే మీరు రాకెట్లా ప్రజల్లోకి దూసుకెళుతున్నారు.. అందుకే మార్చామని చెప్పారు. దళితుడు నాయకత్వ స్థానంలో ఉండకూడదన్న కక్షతో, దురుద్దేశంతోనే నన్ను ఎమ్మెల్యేగా పంపించారు. బడుగు బలహీనవర్గాల వారికీ ఆత్మాభిమానం ఉంటుంది. టికెట్‌ నిరాకరించిన తర్వాత మళ్లీ ఆయన ముఖం చూడలేదు. పవన్‌ను నన్ను పిలిచి మాట్లాడారు. కూటమిలో అవకాశం ఇవ్వాలని కోరా. భాజపాకు నా వివరాలు పంపగానే పరిశీలించి టికెట్‌ ఇచ్చారు’ అని పేర్కొన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్‌కు టికెట్టా?: ఆరణి శ్రీనివాసులు

‘బీసీల పేరు చెప్పి వారి ఓట్లు తీసుకుని మోసం చేసిన వ్యక్తి జగన్‌. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుతో కలిపి ఆరు జిల్లాల్లో 74 అసెంబ్లీ సీట్లు ఉండగా రెండు బలిజ సామాజికవర్గానికి ఉండేవి. వాటినీ తన వాళ్లకు ఇచ్చారు. చిత్తూరులో నన్ను తప్పించి ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డికి ఇచ్చారు. ఆయన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో అభివృద్ధి తితిదే నిధులతోనే జరిగింది. రాష్ట్రప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వలేదు’ అని తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని