వివేకా హంతకులెవరో ప్రజలకు తెలుసు

బాబాయ్‌ని చంపిందెవరో, అబ్బాయిని కాపాడుతున్నదెవరో ప్రజలకు తెలుసని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 30 Mar 2024 07:27 IST

కూటమి తరఫున సీటు వస్తుందనే నమ్మకం ఉంది
ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడి

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: బాబాయ్‌ని చంపిందెవరో, అబ్బాయిని కాపాడుతున్నదెవరో ప్రజలకు తెలుసని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన పెదఅమిరంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హంతకులు ఎవరో మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మా సోదరీమణులకు తెలిసినా అబద్ధాలాడుతున్నారంటూ అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని నిస్సిగ్గుగా చెప్పడం ఒక్క జగన్‌కే సాధ్యం’ అని ఎంపీ ఆక్షేపించారు. ‘బాబాయ్‌ హత్య కేసులో సీబీఐ విచారణ కోరి.. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నావ్‌..? నీవు నిందితుడివని చెప్పేస్తారని భయపడి వద్దన్నావా.. 2019లో బాబాయ్‌ని చంపి శవ రాజకీయాలతో గెలిచావు.. ఆ కేసును అపరిష్కృతంగా ఉంచి అదే బాబాయ్‌ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నావ్‌.. అని సునీత ప్రశ్నించిన తీరు ముదావహం. వైకాపాకు ఓటు వేయవద్దని ధైర్యంగా చెప్పడం, ప్రజలకు నిజం తెలియాలని ఆమె పడుతున్న తపనకు తెలుగు ప్రజలంతా మద్దతు తెలపాలి. ఒక మహిళ ఇంత తెగువ చూపడం అందరికీ ఆదర్శనీయం’ అని పేర్కొన్నారు.

కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే..

‘చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని బల్లగుద్ది చెబుతున్నా. జగన్‌ తిరుగుతున్న రాయలసీమలోనే విపక్షనేత చంద్రబాబు ప్రజల్లోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని అన్నారు. ‘నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేదు.. కూటమి తరఫున కచ్చితంగా నాకు సీటొస్తుందనే నమ్మకం ఉంది. సీఎం జగన్‌కు ఆర్థిక బలం చాలా ఎక్కువ. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వారు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ప్రజలకు తెలియజేయాలి. సీట్ల కేటాయింపులో తప్పిదాలను సరిచేసుకొని మరిన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. దిల్లీ నేతలతో ఉన్న సాన్నిహిత్యం జిల్లాకు చెందిన భాజపా నాయకులతో లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సంకేతాలు వ్యతిరేకంగా వెళ్లి ఉంటాయి. ప్రస్తుత అభ్యర్థి శ్రీనివాసవర్మ నాకు మంచి మిత్రుడు. 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి టికెట్‌ ఇచ్చి ఉంటారు. ఇది మంచి పరిణామమే. అయితే ఇప్పటి వరకు ఆయనకు టికెట్‌ ఇవ్వలేదనే సంకేతాలు అధిష్ఠానానికి వెళ్లి ఉంటాయి. 2009లో ఆయన పోటీ చేశారు. దిల్లీ పెద్దలు మరింత ఆరా తీస్తున్నారు, సర్వేలు చేయిస్తున్నారు. ఇంకా సమయం ఉంది. ఏదైనా జరగవచ్చు. నేను పోటీలో ఉంటా. నాకు న్యాయం జరుగుతుంది’ అని వెల్లడించారు.


అమరావతి రైతుల మద్దతు

అమరావతి రైతుల ఉద్యమానికి తొలి నుంచి మద్దతు పలుకుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూటమి తరఫున పోటీకి అవకాశం ఇవ్వాలని అమరావతి ఐకాస నాయకులు డిమాండ్‌ చేశారు. అమరావతి నుంచి వచ్చిన ఐకాస ప్రతినిధులు శుక్రవారం రఘురామను ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో ప్రతిరోజు 11 కిలోల పొంగల్‌ను నైవేద్యంగా సమర్పించి అమ్మవార్లను ఏవిధంగా వేడుకుంటున్నామో... రఘురామకు సీటు, విజయం కోసం అలాగే మొక్కుకున్నామని తెలిపారు. ఆయనకు సీటు ఖరారైన తర్వాత మద్దతు తెలిపేందుకు వేలమంది రైతులు అమరావతి నుంచి తరలివస్తారన్నారు. ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే మరింత బలం చేకూర్చుకోవాలని, ఎన్డీయే తరఫున రఘురామకు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని