తెదేపా అభ్యర్థుల తుది జాబితా విడుదల

తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్‌సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్‌సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది.

Updated : 30 Mar 2024 06:05 IST

తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలకు ప్రకటన

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్‌సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్‌సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. భాగస్వామ్య పక్షాల్లో భాజపా కూడా పోటీ చేస్తున్న ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. జనసేన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెదేపా పోటీ చేసే మొత్తం స్థానాలకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ సీనియర్‌ నాయకులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు సీట్లపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ తెరదించింది. గంటా కోరుకున్నట్లే ఆయనకు భీమిలి టికెట్‌ దక్కింది. పార్టీ అధినేత చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించగా, ఆయన మొదటి నుంచీ భీమిలిపైనే ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. చివరకు ఆయన అభీష్టానికి తగ్గట్లే భీమిలి స్థానాన్ని పార్టీ ఆయనకు ఖరారు చేసింది.

పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు భాజపాకు వెళ్లడంతో కళా వెంకట్రావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది. ఎచ్చెర్ల సీటు కోసం కళాతో పోటీపడ్డ కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం లోక్‌సభ టికెట్‌ దక్కింది. ఈసారి కళా వెంకట్రావు అభ్యర్థిత్వంపై మొదటి నుంచీ కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. మొదటి మూడు జాబితాల్లో కళా పేరు లేకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. భాజపాకు మొదట కేటాయించిన శ్రీకాకుళం సీటుకు బదులుగా... ఎచ్చెర్ల ఇవ్వడంతో కళా కోసం పార్టీ ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. చీపురుపల్లితో పాటు, విజయనగరం లోక్‌సభ స్థానానికీ ఆయన పేరు పరిశీలించింది. చివరకు చీపురుపల్లి స్థానాన్ని ఖరారు చేసింది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్‌ దక్కింది. ఆయన ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆలూరు శాసనసభాస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలూరు స్థానాన్ని పార్టీ ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్‌కే తెదేపా ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు అసెంబ్లీ స్థానానికి మొదటి జాబితాలోనే సియారి దొన్నుదొరను అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. పొత్తులో భాగంగా పాడేరు సీటు భాజపాకు వెళుతుందని అనుకున్నారు. భాజపా అరకు సీటు కోసం పట్టుబట్టడంతో... తెదేపా ఆ స్థానాన్ని వదులుకుని పాడేరు తీసుకుంది.

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అసెంబ్లీ టికెట్‌

  • ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన పాడేరు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేశ్‌నాయుడికి తెదేపా అవకాశం కల్పించింది. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రమేశ్‌నాయుడి తల్లి కిల్లు వెంకటరత్నం గతంలో మండల ఉపాధ్యక్షురాలిగా, పాడేరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు.
  • ఒంగోలు జిల్లాలోని దర్శి టికెట్‌ను యువ వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మికి కేటాయించింది. ఆమె మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి వరుసకు కుమార్తె అవుతారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు, తెదేపా నేత కడియాల వెంకటేశ్వరరావు కోడలు.
  • కందికుంట వెంకట ప్రసాద్‌పై తెలంగాణ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో మొదట కదిరి టికెట్‌ను ఆయన భార్య యశోదాదేవికి పార్టీ ప్రకటించింది. ప్రసాద్‌పై ఇటీవల కేసు కొట్టేయడంతో ఆయనకే టికెట్‌ ఖరారు చేసింది.
  • అనంతపురం అర్బన్‌ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు.
  • రాజంపేట అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి కుమారుడు. మొదట ఆయన పేరుని రాజంపేట లోక్‌సభ స్థానానికి పార్టీ పరిశీలించింది. పొత్తులో ఆ సీటు భాజపాకి వెళ్లడంతో... రాజంపేట అసెంబ్లీ సీటు ఖరారు చేసింది.

ఒంగోలు లోక్‌సభ సీటు శ్రీనివాసులురెడ్డికే

విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని తెదేపా శుక్రవారం ప్రకటించింది. ఒంగోలు టికెట్‌ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే ఖరారు చేసింది. ఆ స్థానానికి మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేరును పార్టీ పరిశీలించినా... తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపింది. విజయనగరం టికెట్‌ను కలిశెట్టి అప్పలనాయుడికి కేటాయించింది. పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... దివంగత నేత ఎర్రన్నాయుడి శిష్యుడిగా ఎదిగారు. ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. అనూహ్యంగా ఆయనకు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం దక్కింది. కడప టికెట్‌ను చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆయన జమ్మలమడుగు భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు. భూపేష్‌రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్నారు. పొత్తులో ఆ సీటు భాజపాకు వెళ్లడంతో, పార్టీ ఆయనకు కడప లోక్‌సభ టికెట్‌ కేటాయించింది. అనంతపురం అభ్యర్థిఅంబికా లక్ష్మీనారాయణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. గతంలో అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.


38 మంది బీసీలకు ఎన్‌డీఏ అసెంబ్లీ టికెట్లు

రాష్ట్రంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జనసేన, భాజపా కలిసి మొత్తం 38 మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చాయి. జనసేన ఇంకా 3 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన 172 స్థానాల్లో తెదేపా 34, జనసేన 2, భాజపా 2 సీట్లు బీసీలకు కేటాయించాయి. శాసనసభ సీట్లలో తెదేపా ముస్లింలకు 3, ఎస్సీలకు 25, ఎస్టీలకు 4, వైశ్యులకు 2, క్షత్రియులకు 5, వెలమకు 1 స్థానాన్ని కేటాయించింది. జనసేన ప్రకటించిన 18 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 సీటు కేటాయించింది. భాజపా పోటీ చేస్తున్న 10 స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీ, ఎస్టీలకు చెరొక స్థానాన్నీ కేటాయించింది. లోక్‌సభ స్థానాల్లో తెదేపా ఆరుగురు బీసీలకు, ముగ్గురు ఎస్సీలకు టికెట్లు ఇచ్చింది. మహిళలకు తెదేపా 21, జనసేన ఒక అసెంబ్లీ సీటు కేటాయించాయి. లోక్‌సభ సీట్లలో మహిళలకు భాజపా 2, తెదేపా ఒక సీటు కేటాయించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని