జగన్‌ నిర్వాకం వల్లే సీమలో కరవు

మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ చేయాలని 90 శాతం  రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తే జగన్‌ రద్దు చేశారు.

Updated : 30 Mar 2024 06:15 IST

కర్నూలులో వారానికోసారి నీళ్లు ఇస్తున్నారు
కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా
తాడేపల్లి నుంచి కంటెయినర్‌లో తరలిపోతున్న డబ్బులు
ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు


మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ చేయాలని 90 శాతం  రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తే జగన్‌ రద్దు చేశారు. రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా. రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్‌ రద్దు చేశారు.. రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.

తెదేపా అధినేత చంద్రబాబు


నంద్యాల పట్టణం, బనగానపల్లి, కావలి, వింజమూరు, న్యూస్‌టుడే, ఈనాడు- నెల్లూరు : ‘తాగు.. సాగు నీరు ఇవ్వలేని వ్యక్తి ఓట్లు అడిగేందుకు వస్తున్నారు.. జగన్‌ నిర్వాకం వల్లే సీమలో నీళ్లు లేవు. కర్నూలులో వారానికోసారి సరఫరా చేస్తున్నారు. స్నానం చేయడానికి, ఇతర అవసరాలకూ నీళ్లు లేని పరిస్థితిని జగన్‌ తీసుకొచ్చారు. తెదేపా హయాంలో రాయలసీమలో ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్‌రెడ్డి మాత్రం సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు అంత కూడా వెచ్చించలేదు. సలహాదారులకు ఇచ్చే వేతనం అంత కూడా వ్యయం చేయలేకపోయారు. ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో రాయలసీమలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు. సిద్దాపురం, పులకుర్తి, గోరుకల్లు రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఇచ్చామని, పులికనుమ, అవుకు టన్నెల్‌నూ పూర్తిచేశామని తెలిపారు. రాయలసీమకు ఆప్తులెవరు.. ద్రోహులెవరు.. జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు.

ప్రజాగళం పేరుతో వచ్చా.. సింహగర్జన, శంఖారావం చేయడానికి వచ్చా.. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించడానికి వచ్చా.. మీరు సిద్ధమా? అని ప్రజలను ఉత్తేజపరిచారు. శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి, వింజమూరుల్లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన మహానుభావుడు ఎన్టీఆర్‌.. అన్ని వర్గాలనూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. కియా తెదేపా బ్రాండ్‌గా పేర్కొంటూ.. జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్‌ బ్రాండ్‌గా అభివర్ణించారు. జాబు రావాలంటే కచ్చితంగా బాబు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నీరు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు ద్వారా సీమ దశ, దిశ మారుతుందని స్పష్టం చేశారు.

‘మూడు రాజధానులు చేశానని జగన్‌ మాట్లాడుతున్నారు. కర్నూలుకు రాజధాని వచ్చిందా’ అని చంద్రబాబు ప్రజల్ని అడిగారు.. అందరూ లేదు.. లేదు అంటూ సమాధానం ఇచ్చారు. మూడు ముక్కలాటతో చిరునామా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయని.. వాటికి పరిష్కారం చూపే బాధ్యత తెదేపా తీసుకుందన్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావాలన్నది తన సంకల్పమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద పేదవారికి పంచాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ‘తాడేపల్లి నుంచి కంటెయినర్‌లో డబ్బులు తరలిపోతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఫర్నిచర్‌, వంట సామగ్రికి అని వైకాపా నాయకులు చెబుతున్నారు. మద్యంలో దొంగిలించిన, ఇసుకలో బొక్కిన, అడ్డంగా సంపాదించిన డబ్బులను పోలీసుల సహకారంతో కంటెయినర్‌లో పెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు.

క్వార్టర్‌ మద్యం సీసాను రూ.200కు విక్రయించి రూ.140 జగన్‌ తన ఖాతాలో జమ చేసుకుంటున్నారు. క్వార్టర్‌ బాటిల్‌ చూస్తే గుర్తుకు వచ్చేది జగన్‌రెడ్డి మాత్రమే’ అని చంద్రబాబు విమర్శించారు. ‘రాష్ట్రంపై రూ.12 లక్షల కోట్ల అప్పు ఉంది. వ్యవస్థలను జగన్‌ ఛిన్నాభిన్నం చేశారు. బీసీ జనార్దన్‌రెడ్డి లాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టారు. నాతో సహా అనేక మందిని జైలుకు పంపించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చక్రవడ్డీతో సహా వసూలు చేస్తాం. సైకో పోవాలి-రాష్ట్రం నిలబడాలి. అందుకే కలిసి వచ్చే పవన్‌ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నాం. వ్యతిరేక ఓటు చీలకూడదనే భాజపాతో కలిశాం. ఏ ఒక్క మైనార్టీకి కూడా మా పాలనలో అన్యాయం జరగదు. మతసామరస్యం కాపాడిన పార్టీ తెదేపానే. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సైకోను ఇంటికి పంపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

తెలుగువారు గుర్తింపు పొందాలి

తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలనేది మా ఆశయం. ఇది జరుగుతుంది. తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే నా హామీ అంటూ చంద్రబాబు ప్రకటించారు. కూడు, గూడు, గుడ్డ పేదవారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించారని చెప్పారు. పేదవారికి, వృద్ధులకు రూ.30తో పింఛన్‌ ప్రారంభించిన పార్టీ తెదేపానేనన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు తెచ్చామన్నారు. ఓర్వకల్లులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు వచ్చిందంటే అది తెదేపా వల్లనేనని తెలిపారు.

తెదేపాతోనే మైనార్టీలకు న్యాయం

‘తెలుగుదేశం ప్రభుత్వంతోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. ఎన్డీయేలో ఉన్నా ముస్లింల హక్కులను కాపాడటం తెదేపా బాధ్యత. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలని తెదేపా హయాంలో 12 లక్షల టిడ్కో ఇళ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా వాటిని ఇవ్వకుండా రంగులు మార్చుకున్నారు. ఇప్పుడున్న కాలనీలు అలానే ఉంటాయి. ఏమీ రద్దు కావు. అక్కడే మీరు ఇళ్లు కట్టుకునేందుకు మరిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆదుకుంటా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

9 డీఎస్సీలు నిర్వహించాం

‘నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. ప్రజల నుంచి ఉద్యగ సంఘాల వరకు అందిరినీ అణగదొక్కుతున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను ఆదుకుంటాం. యానాదుల కోసం కొత్తగా ప్రత్యేక కార్యక్రమాలు తెస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డీఎస్సీలు, ఎన్టీఆర్‌ 3 డీఎస్సీలు పెడితే.. జగన్‌రెడ్డి 5 ఏళ్లల్లో ఒక్కటైనా పెట్టాడా? జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. అధికారంలోకొచ్చాక నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం’ అని చంద్రబాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని