సంక్షిప్త వార్తలు (12)

లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కోడలు అర్చనా పాటిల్‌ భాజపాలో చేరారు.

Updated : 31 Mar 2024 06:13 IST

భాజపాలో చేరిన శివరాజ్‌ పాటిల్‌ కోడలు

ముంబయి: లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కోడలు అర్చనా పాటిల్‌ భాజపాలో చేరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. యూపీఏ-1 హయాంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్‌ పాటిల్‌ ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రదాడి నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు. దీనికి ముందు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు.


ఎన్డీయేకే పశుపతి పరాస్‌ మద్దతు

దిల్లీ: బిహార్‌లో తమకు ఒక్క సీటూ కేటాయించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటికొచ్చిన కేంద్ర మాజీ మంత్రి, ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి కుమార్‌ పరాస్‌ యూటర్న్‌ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతిస్తామని శనివారం ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. ‘ఎన్డీయేలో రాష్ట్రీయ లోక్‌ జన్‌శక్తి పార్టీ అవిభాజ్య భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీయే మా నేత. ఎన్డీయే ఈసారి 400కుపైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం’ అని పరాస్‌ పేర్కొన్నారు. తన పోస్టును కేంద్ర మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్యాగ్‌ చేశారు.


అరుణాచల్‌ సీఎం సహా 10 మంది ఏకగ్రీవం

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మే సహా 10 మంది భాజపా అభ్యర్థులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారం ముగియడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పవన్‌కుమార్‌ సైన్‌ విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. తవాంగ్‌ జిల్లా ముక్తో నియోజకవర్గం నుంచి ఖండూ ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఆరు చోట్ల ఇలా ఒక్కొక్క నామినేషన్‌ రాగా, నాలుగుచోట్ల ప్రత్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 10 మంది ఎలాంటి పోటీ లేకుండా విజేతలయ్యారు. ఖండూ అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇది నాలుగోసారి.


ఐటీ నోటీసులపై కాంగ్రెస్‌ నిరసనలు

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పంపిన తాజా నోటీసులపై కాంగ్రెస్‌ శనివారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పన్ను ఉగ్రవాద’ చర్యలతో తాము బెదిరేది లేదని స్పష్టంచేసింది. ఈ విమర్శలను భాజపా ఖండించింది.  శుక్రవారం రాత్రి తనకు ఐటీ శాఖ నుంచి నోటీసు అందిందని, అది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ తెలిపారు. తనకు సంబంధించిన కేసు ఇప్పటికే పరిష్కారమైందని చెప్పారు. భాజపా నేతల పన్ను ఉల్లంఘనలను అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలు.. ఐటీ అధికారుల కళ్లకు ఎవరు గంతలు కడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక సాయం చేయాలని ప్రజలనే కోరాలని పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్విరాజ్‌ సాథే సూచించారు. పార్టీలన్నింటినీ నాశనం చేయాలని భాజపా అనుకుంటోందని, ఇది అందరికీ  హెచ్చరిక అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘ఆ పార్టీ ఎజెండా అయిన ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ఉద్దేశం ‘ఒకే దేశం.. ఒకే పార్టీ’. ప్రజలు దీన్ని త్వరలోనే గమనిస్తారు’’ అని పేర్కొన్నారు.


బారామతిలో వదినా మరదళ్ల మధ్యే పోటీ

ముంబయి: శరద్‌ పవార్‌ కంచుకోట బారామతిలో ఆయన కుటుంబ సభ్యులే పరస్పరం తలపడే పరిస్థితి నెలకొంది. పవార్‌ కుమార్తె, ప్రస్తుత ఎంపీ సుప్రియా సూలేతో.. పార్టీని చీల్చి ఎన్డీయేలో చేరిన అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ పోటీపడనున్నారు. వీరిద్దరూ వదినా మరదళ్లు. శనివారం బారామతిలో మహాయుతి (ఎన్డీయే కూటమి- శివసేన, భాజపా, ఎన్సీపీ) అభ్యర్థిగా సునేత్రను అధికారికంగా ప్రకటించారు. ఇది తనకెంతో కలిసివచ్చిన రోజని తన అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత స్పందించిన 60ఏళ్ల సునేత్ర వ్యాఖ్యానించారు.


చట్టానికి కాంగ్రెస్‌ పార్టీ అతీతం కాదు
కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌

జమ్ము: చట్టానికి కాంగ్రెస్‌ పార్టీ అతీతమేమీ కాదని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి శనివారం జమ్ము వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే యూపీఏ నుంచి ఇండియా కూటమి అని పేరు మార్చుకున్నారని విమర్శించారు. ‘ఆరు దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్‌కు ఇంకా ఆ అభిజాత్యం పోలేదు. అన్ని పార్టీలూ ఐటీ నిబంధనలను అమలు చేస్తున్నప్పుడు ఆ ఒక్క పార్టీనే ఎందుకు ప్రత్యేకం?’ అని కేంద్రమంత్రి ప్రశ్నించారు.


కొండలెక్కగలను.. ఓట్లు అడగగలను!

ఉధంపుర్‌: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ నియోజక వర్గం నుంచి భాజపా తరఫున పోటీచేస్తున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ శనివారం ఇలా కొండ ప్రాంతాల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


యుద్ధప్రాతిపదికన పింఛన్లు పంపిణీ చేయాలి

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వాలంటీర్లను పింఛను పంపిణీ తదితర విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినందున సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే పింఛన్లు అందజేసేలా  యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. వాలంటీర్లను ప్రజాసేవా కార్యక్రమాలకు ఉపయోగించకుండా... వైకాపా ప్రచారానికి వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. వాలంటీర్లతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా చేసి.. వారి సస్పెన్షన్లు, క్రిమినల్‌ కేసుల నమోదుకు జగన్‌ కారణమయ్యారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.


బుట్టా రేణుక పేదరాలనడం కంటే దౌర్భాగ్యం లేదు

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్‌కు మతిపోయి.. బుట్టా రేణుక లాంటి సంపన్నుల్ని పేదవాళ్లంటున్నారని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. బుట్టా రేణుకను పేదరాలు అనడం కంటే దౌర్భాగ్యం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలను పరిశీలిస్తే అత్యంత ధనికులకు సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్‌రెడ్డేనని తెలిపారు. ఈసారి గనులు, భూములు, ఇసుక, మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌రెడ్డి... మరోసారి వస్తే  రాష్ట్రాన్నే హోల్‌సేల్‌గా అమ్మేస్తారని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పేదల పెన్నిధి చంద్రబాబు... ద్రోహి జగన్‌. తెదేపా హయాంలో పేదల కడుపు నింపడానికి పెట్టిన అన్నక్యాంటీన్లను.. జగన్‌ సీఎం కాగానే రద్దుచేశారు. మద్యనిషేధం చేస్తానని.. కల్తీమద్యాన్ని ఏరులై పారించి మహిళల మాంగల్యాలు తెంచారు. 20 వేల ఎకరాల ఎసైన్డ్‌భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు కుదించి బీసీలకు దక్కాల్సిన 16,800 పదవుల్ని దూరం చేశారు’’ అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.


జవహర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌కు రాష్ట్రంలో ఏదైనా ఎస్సీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలని దళిత ప్రజాసంఘాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పున:పరిశీలించాలని కోరుతూ తెదేపా ఎన్నికల సమన్వయకర్త దేవినేని ఉమా, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు శనివారం వినతిపత్రం ఇచ్చారు.


మద్యం నిషేధించకుండా ఎలా ఓట్లడుగుతారు?

పదేపదే అబద్ధాలతో మోసం చేస్తామంటే కుదరదు
సీఎం జగన్‌పై  దేవినేని ఉమా ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి... మద్యం నిషేధించకుండా ఎలా ఓట్లడుగుతారని సీఎం జగన్‌పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో రూ.వేల కోట్లు దోచుకున్నది కాక.. 30వేల పేద కుటుంబాల్ని దిక్కులేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు ఛార్జీలు పెంచనని ప్రతిపక్షనేతగా చెప్పి.. అధికారంలోకి వచ్చాక తొమ్మిది సార్లు ఛార్జీలను పెంచారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘గతంలో రూ.200 ఉన్న ఇంటిపన్నును నేడు రూ.వెయ్యికి పెంచారు. ఏటా జనవరి 1న జ్యాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని నిరుద్యోగ యువతను మోసం చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రిస్తానని కనీసం వ్యాట్‌ తగ్గించలేదు’’ అని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ముందు చెల్లెళ్లు షర్మిల, సునీతల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


జగన్‌ అసమర్థ పాలనే నిరుద్యోగితకు కారణం!

భాజపా నేత లంకా దినకర్‌

ఈనాడు, అమరావతి: దేశంలో అత్యధికంగా 24% నిరుద్యోగిత రేట్‌తో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండడం సీఎం జగన్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు. ప్రధాని మోదీ అగ్రవర్ణాల పేదలకు 10% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కల్పిస్తే.. రాష్ట్రప్రభుత్వం అమలుచేయట్లేదని ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. మరోసారి జగన్‌ గెలిస్తే శతాబ్దం వెనక్కిపోతుంది. కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఒంగోలువద్ద కొత్తపట్టణం ఫిషింగ్‌ హార్బర్‌ కార్యకలాపాలు ఎందుకు సాగడంలేదు? 2024-25 సంవత్సరానికి సంబంధించి కొత్తగా 5 వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు రావడంలో తీవ్ర జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’ అని మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు