వ్యక్తి కాదు.. వ్యవస్థల రక్షణే లక్ష్యం

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ శనివారం స్పష్టం చేసింది.

Updated : 31 Mar 2024 06:34 IST

దిల్లీలో నేటి ఇండియా కూటమి ర్యాలీపై కాంగ్రెస్‌ స్పష్టీకరణ

దిల్లీ: భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ శనివారం స్పష్టం చేసింది. ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదని తెలిపింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగానే ఈ సభ జరుగుతోందని ఆప్‌ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ శకం ముగిసిపోయిందనే సందేశాన్ని కల్యాణ్‌ మార్గ్‌( ప్రధాని మోదీ నివాసం)కి ఇండియా కూటమి గట్టిగా వినిపించనుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

‘ఇది ఏ ఒక్క వ్యక్తి లేదా పార్టీ కోసమో నిర్వహిస్తున్న సభ కాదు. అందుకే లోక్‌తంత్ర బచావో ర్యాలీ అనే పేరు పెట్టాం. ఇండియా కూటమికి చెందిన 27-28 పార్టీలన్నీ పాల్గొంటాయి’ అని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. భాజపా పాలనలో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని, ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు భగవంత్‌మాన్‌, అఖిలేశ్‌యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు సభకు హాజరవుతారని జైరాం రమేశ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ కూడా సభలో పాల్గొంటారని సమాచారం.

దిల్లీలో ఆదివారం ఇండియా కూటమి నిర్వహించే సభకు 20వేల మంది ప్రజలు హాజరయ్యేందుకు మాత్రమే అధికారులు అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే, పంజాబ్‌ రాష్ట్రం నుంచే లక్ష మందికి పైగా వస్తారని ఆప్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్‌లీలా మైదానంలో నిర్వహించే సభ కోసం పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. సభకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రాంగణంలోకి అనుమతిస్తామని తెలిపారు.


దేశాన్ని పాలిస్తోంది నేరగాళ్ల ముఠానా?: రాహుల్‌ గాంధీ ధ్వజం

ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం గొంతు నులిమేస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశాన్ని ప్రభుత్వం పాలిస్తున్నట్లుగా లేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా ఒక చేత్తో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ మరో చేత్తో విపక్షాల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తోందని దుయ్యబట్టారు. ‘భాజపా వెంట లేకపోతే జైళ్లలోకి తోసేయడం... విరాళాలు ఇస్తే బెయిల్‌పై విడుదల చేయడం...ఇదంతా చూస్తుంటే దేశాన్ని నేరస్థుల ముఠా పాలిస్తున్నట్లుగా ఉంద’ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రాహుల్‌ పోస్ట్‌ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఇండియా కూటమి వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.


భాజపా...ఓ వాషింగ్‌ మెషిన్‌!

అవినీతిపరుల మరకల్ని మాయం చేస్తుంది
కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా వ్యాఖ్య

దిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు భాజపాలో చేరిన తర్వాత నిజాయతీ గల వ్యక్తులుగా బయటకు వస్తారంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. భాజపా పెద్ద ఆటోమెటిక్‌ వాషింగ్‌ మెషిన్‌ అని..అవినీతి, మోసం, కుంభకోణం వంటి మరకలు పడిన వారిని మోదీ అనే వాషింగ్‌ పౌడర్‌తో శుభ్రంగా మారుస్తోందంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై వాషింగ్‌ మెషిన్‌ను ప్రదర్శించి దానిని భాజపాతో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మెషిన్‌ ధర రూ.8,500 కోట్లు (భాజపా ఎన్నికల బాండ్ల విలువ) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని