రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో 27 మంది సభ్యులతో భాజపా మేనిఫెస్టో కమిటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో భాజపా 27 మంది సభ్యులతో శనివారం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది.

Published : 31 Mar 2024 04:00 IST

కన్వీనర్‌గా సీతారామన్‌

దిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో భాజపా 27 మంది సభ్యులతో శనివారం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కేంద్ర మంత్రులు, గుజరాత్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌ సీఎంలతో పాటు.. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, వసుంధర రాజె లాంటి సీనియర్‌ నేతలకూ కమిటీలో స్థానం కల్పించారు. 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కూడా రాజ్‌నాథ్‌ సింగే అధ్యక్షత వహించారు. ప్రస్తుత కమిటీలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, భూపేందర్‌ యాదవ్‌, కిరణ్‌ రిజిజు, అర్జున్‌ ముండా, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, స్మృతీ ఇరానీ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఉన్నారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, చత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌లకు కూడా చోటు కల్పించారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ సహా కొందరు భాజపా సీఎంలకు స్థానం దక్కలేదు. కమిటీలో చోటు లభించని సీనియర్లకు ఎన్నికలకు సంబంధించిన ఇతర కమిటీల్లో చోటు కల్పిస్తామని పార్టీవర్గాలు తెలిపాయి. బిహార్‌ భాజపా సీనియర్‌ నేతలు సుశీల్‌కుమార్‌ మోదీ, రవిశంకర్‌ ప్రసాద్‌, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, పార్టీ వ్యవస్థాగత నేతలు వినోద్‌ తావ్డే, రాధా మోహన్‌దాస్‌ అగర్వాల్‌, మన్‌జీందర్‌ సింగ్‌ సిర్సా, తారీఖ్‌ మన్సూర్‌, అనిల్‌ ఆంటోనీలు కూడా కమిటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని