కేంద్రంలో రాబోయేది మా ప్రభుత్వమే

భాజపా సర్కారు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌ అన్నారు.

Published : 31 Mar 2024 04:03 IST

ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా సర్కారు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌ అన్నారు. ఆమె శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదాయ పన్ను చెల్లించలేదనే సాకుతో కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేసిందని, అదే రూ.4,617 కోట్లకు సంబంధించి పన్ను చెల్లించని భాజపాకు ఎందుకు నోటీసులు పంపలేదు? భాజపాకు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‘పాంచ్‌ న్యాయ్‌ గ్యారంటీ’లతో ఎన్నికల రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.


ఎవరినీ బలవంతంగా చేర్చుకోవట్లేదు
ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇతర పార్టీల నుంచి ఎవరినీ కాంగ్రెస్‌లోకి బలవంతంగా చేర్చుకోవడం లేదని, నాయకులు తమ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినాయకత్వానిదేనని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని భారాస, భాజపా నేతలు అంటుంటే తెలంగాణ సమాజం విస్తూ పోతోందన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఏక్‌నాథ్‌ శిందే అనడం విడ్డూరంగా ఉందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని