మాజీ సీఎంల కుటుంబ సభ్యులకు భాజపా టికెట్లు

భాజపా శనివారం రాత్రి పంజాబ్‌లోని ఆరు, ఒడిశాలోని మూడు, పశ్చిమ బెంగాల్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు కలిపి మొత్తం 11 మంది అభ్యర్థులతో ఎనిమిదో జాబితా విడుదల చేసింది.

Published : 31 Mar 2024 04:05 IST

మరో 11 పేర్లతో 8వ జాబితా విడుదల
సినీనటుడు సన్నీ దేవోల్‌కు ఈసారి మొండిచేయి
అమృత్‌సర్‌ నుంచి మాజీ రాయబారి సంధు

ఈనాడు, దిల్లీ: భాజపా శనివారం రాత్రి పంజాబ్‌లోని ఆరు, ఒడిశాలోని మూడు, పశ్చిమ బెంగాల్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు కలిపి మొత్తం 11 మంది అభ్యర్థులతో ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ భార్య, మరో మాజీ సీఎం బియాంత్‌సింగ్‌ మనవడు రవ్‌నీత్‌సింగ్‌ బిట్టు, బిజద లోంచి భాజపాలో చేరిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్‌ తనయుడు భర్తృహరి మహతాబ్‌లకు టికెట్లు కేటాయించింది. ప్రస్తుతం వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌లోని పటియాలా, లుథియానా, ఒడిశాలోని కటక్‌ సీట్లనే కాషాయదళం ఈ ముగ్గురికీ మళ్లీ కట్టబెట్టింది. అలాగే 17వ లోక్‌సభలో ఆప్‌ నుంచి ప్రాతినిధ్యం వహించి ఇటీవల భాజపాలో చేరిన జలంధర్‌ ఎంపీ సుశీల్‌కుమార్‌ రింకూను మళ్లీ అదే స్థానం నుంచి బరిలో నిలిపింది. ఈ నలుగురూ గత వారం రోజుల వ్యవధిలో భాజపాలో చేరారు. వాయవ్య దిల్లీ సిట్టింగ్‌ భాజపా ఎంపీ, పంజాబీ జానపద గాయకుడైన హన్స్‌రాజ్‌ హన్స్‌కు ఈసారి పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ ఎస్సీ రిజర్వుడు స్థానాన్ని కేటాయించింది. గురుదాస్‌పుర్‌ స్థానం నుంచి సినీనటుడు సన్నీ దేవోల్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఠాకుర్‌ దినేశ్‌సింగ్‌ బబ్బూను రంగంలోకి దింపింది. అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూను నిలిపింది. ఒడిశాలోని జాజ్‌పుర్‌ ఎస్సీ స్థానం నుంచి రబీంద్ర నారాయణ్‌ బెహరా, కంధమాల్‌ నుంచి సుకాంతాకుమార్‌ పాణిగ్రాహిని బరిలోకి దింపింది. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి దేబాశిశ్‌ధర్‌, ఝాడ్‌గ్రాం ఎస్టీ స్థానం నుంచి ప్రణత్‌ టుడూలకు అవకాశం ఇచ్చింది.  తాజా జాబితాతో కలిపి భాజపా ఇప్పటివరకు మొత్తం 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని