మోదీ పాలనలో ఆర్థికంగా చితికిన పేదలు

పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశంలోని పేదల అభ్యున్నతికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

Published : 31 Mar 2024 04:07 IST

ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశంలోని పేదల అభ్యున్నతికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో 11 వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో పేదల ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించిందని అన్నారు.  సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దోపిడీ పెరగడంతోపాటు మతతత్వ విధానాలతో చిచ్చు రేపి ప్రజలను విభజించి పాలిస్తారని ఆరోపించారు. కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపట్టకుండా చూడాలన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులతో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్య విలువలు పతనమవుతాయని పేర్కొన్నారు. మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై  అక్రమ కేసులు బనాయించి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు మోదీ కుట్రలు పన్నుతున్నారని.. దీన్ని ప్రజాస్వామికవాదులు తిప్పికొట్టాలని అన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, డీజీ నర్సింహారావు, రెవెల్యూషనరీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకీరామ్‌, ఆయా వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్‌, బాలమల్లేష్‌, మధు పాల్గొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు భాజపా మతోన్మాద పాలనపై  ప్రజల్లో చైతన్యం కల్పించాలని సదస్సులో తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని