ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దనుకున్నాం

పార్టీ మారుతున్న తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

Updated : 31 Mar 2024 07:23 IST

అవకాశాలు వస్తే ఎలా వినియోగించుకున్నామనేదే ముఖ్యం
నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు
స్టేషన్‌ ఘన్‌పూర్‌ నేతల సమావేశంలో కడియం శ్రీహరి

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ మారుతున్న తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తాను భారాసలో ఉన్న పదేళ్లలో ఎలాంటి తప్పు చేయలేదని, అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసంలో ఆయన స్టేషన్‌ఘన్‌పూర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన కుమార్తె కడియం కావ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడారు. ‘‘అరూరి రమేశ్‌, పసునూరి దయాకర్‌ పార్టీ మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను అందరూ విమర్శిస్తున్నారు. ఎంత ఎక్కువగా విమర్శలు వస్తే అంత ఎక్కువ బలం ఉందని అర్థం. అవకాశాలు అందరికీ వస్తాయి.. వాటిని ఏవిధంగా ఉపయోగించుకున్నాం అనేదే ముఖ్యం. భారాస పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదు. అరూరి రమేశ్‌ వద్దు అంటేనే కావ్యకు టికెట్‌ ఇచ్చారు. పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా పోటీ చేయాలని అనుకున్నాం. కానీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నాయకుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు.

మీ అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం

నా వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఉన్నారు. ఇప్పుడు అధికారం లేక ప్రతిపక్షంలో ఉన్నాం. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలి. మొదటిసారి బరిలో దిగుతున్న కడియం కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దు అనుకున్నాం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలంటూ పిలుపువచ్చింది. మీ అందరి అభిప్రాయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఒక్క కేసు కూడా లేదు. నన్ను ప్రశ్నించే హక్కు ఒక్క స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజలకు మాత్రమే ఉంది. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. నిండు మనసుతో ఆదరించాలి’’ అని కడియం కోరారు. కావ్య మాట్లాడుతూ ‘‘మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కడియం ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని