మా ప్రభుత్వాన్ని టచ్‌ చేసి చూడండి..

‘ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎనుకున్న ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.

Published : 31 Mar 2024 04:08 IST

‘ఆర్‌’ ట్యాక్స్‌పై ఆధారాలుంటే బయటపెట్టండి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎనుకున్న ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. అలాంటి ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్న వారు.. ఒకసారి కాంగ్రెస్‌ను టచ్‌ చేసి చూడండి. తరువాత ఏం జరుగుతుందో తెలుస్తుంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఒక్క భాజపా ఎమ్మెల్యేను టచ్‌ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పైవిధంగా స్పందించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని మోదీ తెలంగాణను అవమానిస్తే రాష్ట్ర భాజపా నేతలు ఒక్కరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో ‘ఆర్‌’ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి ఎందుకు బయటపెట్టడం లేదు..? అందులో మీకేమైనా వాటా రావాల్సి ఉందా..?’ అని మహేశ్వర్‌రెడ్డిని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ‘భారాస(తెరాస) పెట్టి 23 ఏళ్లయింది. అధికారంలో పదేళ్లున్నారు. ఇన్నాళ్లలో బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి గానీ ఇతర కీలక పదవులు గానీ ఇచ్చారా..? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనసభలో కులగణనపై తీర్మానం చేశాం. దీని కోసం రూ.150 కోట్లు విడుదలయ్యాయి. 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎన్నికల తర్వాత వాటికి నిధులు కూడా కేటాయిస్తాం. కాంగ్రెస్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుంది. భాజపా కూడా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి  అన్యాయం చేసింది’ అని పొన్నం ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని