భారాస పాలనలో భూకుంభకోణం

గత భారాస ప్రభుత్వం అతి పెద్ద భూకుంభకోణానికి పాల్పడినట్లు ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు.

Published : 31 Mar 2024 04:09 IST

ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపణ
తూముకుంటలో 26 ఎకరాల అటవీభూమికి రిజిస్ట్రేషన్‌
బొంరాస్‌పేటలో 1065 ఎకరాలు సంతోష్‌ కుటుంబ సంస్థకు కట్టబెట్టినట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గత భారాస ప్రభుత్వం అతి పెద్ద భూకుంభకోణానికి పాల్పడినట్లు ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగిందన్నారు. భూముల కోసం కుట్రపూరితంగానే కేసీఆర్‌ ధరణికి రూపకల్పన చేశారని ఆరోపించారు. రెవెన్యూశాఖను అప్పటి సీఎం కేసీఆర్‌, ఐటీశాఖను కేటీఆర్‌ చూశారని, మొత్తం భూ కుంభకోణాలకు వారిద్దరే బాధ్యులని కోదండరెడ్డి విమర్శించారు. భూకుంభకోణానికి పాల్పడినవారు ఎంత పెద్దవారైనా లోక్‌సభ ఎన్నికలవ్వగానే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నామన్నారు. గాంధీభవన్‌లో శనివారం కోదండరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ చట్టంలోని సెక్షన్‌ 22ఏను ఆధారంగా చేసుకొని శామీర్‌పేట మండలం తూముకుంటలో సర్వేనంబరు 164/1లో 26 ఎకరాల అటవీ భూమిని 2022 జూన్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. సర్వే నంబరు 260/2, 261, 265/8, 361/7, 361/9లలో రక్షణశాఖ భూమిని బాలాజీ అసోసియేట్‌ అనే సంస్థకు ధారాదత్తం చేశారన్నారు. బొంరాస్‌పేటలో 1065 ఎకరాల ప్రైవేట్‌ భూమి అసలైన రైతులకు దక్కకుండా, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుటుంబానికి చెందిన ‘ఎఫ్‌4ఎల్‌ ఫార్మ్స్‌’ అనే సంస్థకు కట్టబెట్టారని కోదండరెడ్డి ఆరోపించారు. చేవెళ్ల మండలం చందన్‌వెల్లిలో 1500 ఎకరాలు దళిత రైతుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని ఎకరాకు నామమాత్రంగా రూ.9 లక్షల చొప్పున పరిహారం చెల్లించారన్నారు. ఈ భూమిని కేటీఆర్‌.. మల్టీ నేషనల్‌ కంపెనీకి ఎకరా రూ.1.30 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాము అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని