మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లోకి వస్తానన్నారు

తనతో పాటు మరో ఐదుగురు మంత్రులు భాజపాలో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.

Published : 31 Mar 2024 04:09 IST

మహేశ్వర్‌రెడ్డే స్వయంగా ఆ విషయం చెప్పారు
భాజపా నేతలతో సంప్రదింపులు అవాస్తవం
గడ్కరీ, అమిత్‌షాలను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకొస్తే ప్రమాణం చేద్దాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తనతో పాటు మరో ఐదుగురు మంత్రులు భాజపాలో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. ‘‘కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అమిత్‌షాలతో నేను మాట్లాడానని చెప్పారు. వారిద్దర్నీ తీసుకుని చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి రండి. నేనూ వస్తాను. ప్రమాణం చేద్దాం. మంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్‌లోకి వస్తానని, సహాయం చేయాలని మహేశ్వర్‌రెడ్డే నన్ను సంప్రదించారు. మాకు సరిపడా మెజార్టీ ఉందని, ఎవర్నీ చేర్చుకునే ఉద్దేశం అధిష్ఠానానికి లేదని చెప్పాను. అందుకే మనసులో ఏదో పెట్టుకుని, నేను అనని మాటలను అన్నట్టుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్‌లో పుట్టాను. కాంగ్రెస్‌ జెండాతోనే పోతాను. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే కోమటిరెడ్డి. మహేశ్వర్‌రెడ్డి.. మూడు పార్టీలు మారారు. తెలంగాణలో రామమందిరం పేరు చెపితే ఓట్లు పడతాయా? అని నాతో చెప్పి బాధపడ్డారు. సొంత ఇమేజ్‌తో గెలిచానని, భాజపా నుంచి వచ్చిన ఫాయిదా ఏమీ లేదని అన్నారు. ఐదేళ్లకో పార్టీ మారే వ్యక్తి నాపై విమర్శలు చేస్తారా? ఆర్థికంగా లోటు బడ్జెట్‌ ఉన్నా కష్టపడి రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై దిల్లీకి డబ్బులు పంపుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచీ అలాగే దిల్లీకి డబ్బుల మూటలు పంపుతున్నారా?’’ అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని