కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు

కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నేతల చేరికల రాజకీయం జోరందుకుంది. శనివారం ఉదయం ఎంపీ కె.కేశవరావు(కేకే) కుమార్తె గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ విజయలక్ష్మి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 31 Mar 2024 06:28 IST

హస్తం గూటికి మేయర్‌ విజయలక్ష్మి, పురాణం సతీశ్‌
కేకే ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నేతల చేరికల రాజకీయం జోరందుకుంది. శనివారం ఉదయం ఎంపీ కె.కేశవరావు(కేకే) కుమార్తె గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ విజయలక్ష్మి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ కాంగ్రెస్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, విజయలక్ష్మి భర్త విజయ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం కేకే ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఆయన వెంట దీపాదాస్‌ మున్షీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన రేణుకా చౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వినోద్‌, వివేక్‌, సీనియర్‌ నేతలు గీతారెడ్డి, జానారెడ్డి తదితరులు ఉన్నారు. తమ ఇంటికి వచ్చిన సీఎంను కేకే, విజయలక్ష్మి శాలువాతో సన్మానించారు. లోక్‌సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎంతో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కేకే చెప్పారు. అనంతరం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. కేకేతో పాటు తామంతా కాంగ్రెస్‌కు చెందినవారమేనన్నారు. మరింతమంది భారాస నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 5న రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో ప్రకటించారు.

  • భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు దీపా దాస్‌మున్షీ కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, పార్టీ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు.
  • కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఒడితల ప్రణవ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ దేశిని స్వప్న కోటి, మాజీ ఉప సర్పంచి దేశిని శ్రీనివాస్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

సీఎం రేవంత్‌ను కలిసిన నందమూరి సుహాసిని

సీఎం రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం నాయకురాలు నందమూరి సుహాసిని శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తదితరులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని