ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కుస్తీ నాటకం

కేరళలో అధికారపక్షమైన ఎల్డీఎఫ్‌, ప్రతిపక్షమైన యూడీఎఫ్‌ రెండూ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివని.. వీరి మధ్య వైరం కేవలం నాటకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 31 Mar 2024 06:26 IST

కార్యకర్తలతో నమో యాప్‌ ద్వారా మోదీ సంభాషణ

తిరువనంతపురం: కేరళలో అధికారపక్షమైన ఎల్డీఎఫ్‌, ప్రతిపక్షమైన యూడీఎఫ్‌ రెండూ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివని.. వీరి మధ్య వైరం కేవలం నాటకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాజపాను, మోదీని ఓడించడంలో రెండు పక్షాల కార్యాచరణ ఒకటేనని తెలిపారు. ఈ విషయాన్ని బూత్‌ స్థాయిలో ఓటర్లు అందరికీ చెప్పాలని,  విద్యావంతులైన కేరళ ప్రజలు వారి ఆటలను గ్రహించాలన్నారు. శనివారం రాష్ట్రంలోని బూత్‌ స్థాయి కార్యకర్తలతో నమో యాప్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. పాలక్కాడ్‌ నియోజకవర్గానికి చెందిన బూత్‌ స్థాయి అధ్యక్షుడు ప్రధానితో మాట్లాడుతూ..‘‘మా నియోజకవర్గంలో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ రెండూ పరస్పరం పోట్లాడుకుంటాయి. కొద్దిదూరం వెళ్లి వలయార్‌ సరిహద్దు దాటగానే వచ్చే తమిళనాడు రాష్ట్రంలో ఓట్ల కోసం కలిసి ప్రచారం చేస్తాయి’’ అని తెలిపారు. నియోజకవర్గంలో ‘ఇండియా’ కూటమిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందని, భాజపా రాకతో అవినీతి అంతమవుతుందని ప్రజలు అనుకొంటున్నారా అని ప్రధాని ఆరా తీశారు.

మరో బూత్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే అసంతృప్తి ఉంది. ఇక్కడ అన్నీ రాజా ఎల్డీఎఫ్‌ అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. దిల్లీకి చేరగానే రాహుల్‌ ప్రధాని కావాలని ఆమె కోరుతున్నారు. ఈ అసంతృప్తి భాజపాకు లాభిస్తుంది’’ అన్నారు. తమ కుంభకోణాలతో కేరళ ప్రజలను దోచుకొంటున్నవారిని వదిలేది లేదని మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేరళ  భాజపా కార్యకర్తల పోరాటం, చూపుతున్న ఉత్సాహం అసమానమని.. క్రమశిక్షణ, త్యాగనిరతి గల కఠోరశ్రమ చేసే ఇటువంటి కార్యకర్తలు తనలో స్ఫూర్తి నింపుతుంటారని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా మావెలిక్కర నియోజకవర్గంలోని చెంగన్నూర్‌ గ్రామ బూత్‌ అధ్యక్షురాలు ప్రధానితో మాట్లాడుతూ..‘‘ఎన్డీయే అభ్యర్థి విజయానికి క్షేత్రస్థాయిలో మేమెంతో కష్టపడుతున్నాం. ఇంటింటికీ తిరిగి సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, బేటీ బచావో.. బేటీ పడావో వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించి చెబుతున్నాం. లబ్ధిదారులు సంతోషిస్తున్నారు. ఈసారి కేరళలో కాషాయ పార్టీ ఖాతా తెరవడం ఖాయం’’ అని తెలిపింది. మావెలిక్కర నియోజకవర్గాన్ని భాజపా తన మిత్రపక్షమైన భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌)కు కేటాయించగా, ఇక్కడి నుంచి బైజు కలశాల పోటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని