ఎన్నికల బాండ్ల రద్దు తీర్పు తర్వాత.. న్యాయవ్యవస్థపై కేంద్రం ఒత్తిడి

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం ఆరోపించారు.

Published : 31 Mar 2024 04:18 IST

ప్రియాంకాగాంధీ ధ్వజం

దిల్లీ: ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో స్వతంత్ర, పటిష్ఠమైన న్యాయవ్యవస్థ ఉండటం మోదీ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న కొన్ని శక్తులు కోర్టుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఇటీవల 600 మందికి పైగా న్యాయవాదులు సీజేఐకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై వెంటనే స్పందించిన ప్రధాని మోదీ ‘‘అది పురాతన పార్టీ కాంగ్రెస్‌ సంస్కృతి’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎక్స్‌’ ద్వారా చేసిన ప్రియాంక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కుంభకోణాల పొరలు బట్టబయలు అవుతున్న తీరు చూసి లేఖల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఇపుడు స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఏదో అనుమానాస్పదంగానే ఉంది. ఆయన ఎందుకో భయపడుతున్నట్టు ఉన్నారు’’ అని ప్రియాంక అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని