ఉప ముఖ్యమంత్రి బూడికి ఇంటిపోరు!

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడికి ఇంటిపోరు మొదలైంది. అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్యాలనాయుడికి మొదట టికెట్ ప్రకటించి, తరువాత ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు.

Published : 31 Mar 2024 04:48 IST

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న ముత్యాలనాయుడి కుమారుడు

ఈనాడు, అనకాపల్లి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడికి ఇంటిపోరు మొదలైంది. అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్యాలనాయుడికి మొదట టికెట్ ప్రకటించి, తరువాత ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో మాడుగుల స్థానం ఆయన రెండో భార్య కుమార్తె అనూరాధకు కేటాయించారు. దీనిపై ఆయన మొదటి భార్య కుమారుడు రవి గుర్రుగా ఉన్నారు. రవి గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేయడానికి నామినేషన్‌ వేస్తే విత్‌డ్రా చేసుకునేలా చేసి.. అప్పుడూ అనూరాధనే బరిలోకి దించారు. అప్పటినుంచి రవి తండ్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడూ.. బూడి కుమార్తె వైపే మొగ్గుచూపడంతో రవి తన సోదరిపైనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. ‘మా నాన్న తులసి మొక్కే. 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయి. జగన్‌ని నమ్ముకొని 9 ఏళ్లు ఆయన వెంట తిరిగాను. ఏనాడూ ముత్యాలనాయుడి కుమారుడిగా పార్టీలో తిరగలేదు. అయిదేళ్ల నుంచి నన్ను రాజకీయంగా తొక్కడం మొదలుపెట్టారు’ అని రవి పేర్కొన్నారు. తాత బూడి వెంకునాయుడు ఆశయాల మేరకు స్వతంత్ర అభ్యర్థిగా మాడుగుల నుంచి పోటీచేయడం ఖాయమని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని