ఓటమి భయంతోనే సీబీఐ, ఈడీ దాడులు

ఓటమి భయంతోనే సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను భాజపా ఇబ్బందులకు గురిచేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 31 Mar 2024 05:32 IST

భాజపాపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శ

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: ఓటమి భయంతోనే సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను భాజపా ఇబ్బందులకు గురిచేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రూ.1,800 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ విభాగంతో నోటీసులు ఇప్పించిందని విమర్శించారు. ఈ నోటీసులను నిరసిస్తూ విజయవాడలోని ఆదాయపు పన్ను కార్యాలయం వద్ద ఆమె నిరసన చేపట్టేందుకు యత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం ఈ అంశంపై ఆంధ్రరత్నభవన్‌ వద్ద విలేకర్లతో షర్మిల మాట్లాడారు. ‘ఓటమి భయంతోనే చంద్రబాబుతో భాజపా పొత్తు పెట్టుకుంది’ అని షర్మిల విమర్శించారు. ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా అదానీ, అంబానీల సహచరులకు ఎంపీ పదవులు ఎందుకు ఇస్తున్నారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ప్రశ్నించారు.ఆంధ్రరత్న భవన్‌లో పార్టీ నాయకులతో షర్మిల సమావేశం కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. తొలుత మహాత్మాగాంధీ రోడ్డులోని ఆదాయపు పన్ను కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని చెప్పడంతో ఆమె మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.

దిల్లీకి నేడు షర్మిల

రాష్ట్రంలో ఇండియా కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు కొలిక్కివచ్చిన నేపథ్యంలో షర్మిల ఆదివారం దిల్లీ వెళుతున్నారు. పార్టీ అధిష్ఠానం పెద్దలతో, ఎన్నికల కమిటీతో ఆమె సమావేశమవుతారు. ఏప్రిల్‌ 1న తొలి విడతగా కొంతమంది అభ్యర్థులతో జాబితా ప్రకటించాలని యోచిస్తున్నారు. రెండో విడతలో మిగతా అభ్యర్థులను వెల్లడించే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని