పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌కు ఘనస్వాగతం

‘అధికార పీఠం కూటమిదే.. రాష్ట్రంలో జనసేన- తెదేపా- భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Published : 31 Mar 2024 05:35 IST

మాజీ ఎమ్మెల్యే వర్మతో భేటీ

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పిఠాపురం, కొత్తపల్లి: ‘అధికార పీఠం కూటమిదే.. రాష్ట్రంలో జనసేన- తెదేపా- భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. సమన్వయంతో నడుద్దాం.. వైకాపాను చిత్తుగా ఓడిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి పవన్‌కల్యాణ్‌ శనివారం వచ్చారు. గొల్లప్రోలులో హెలికాప్టర్‌ దిగి.. అక్కడినుంచి వాహన శ్రేణితో పి.దొంతమూరులోని మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ నివాసానికి చేరుకున్నారు.

వర్మ కుటుంబసభ్యులతో పాటు, తెదేపా నాయకులు, స్థానికులు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన అధినేత.. వర్మ తల్లి మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత తెదేపా జోన్‌-2 ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, వర్మతో భేటీ అయ్యారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆదరణ చూస్తుంటే కూటమి ప్రభుత్వం స్థాపించబోతున్నామనేది స్పష్టమవుతోందన్నారు. తన కోసం త్యాగం చేసిన వర్మను రాబోయే రోజుల్లో ఉన్నతస్థాయిలో నిలబెడతామని హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం శక్తిపీఠం, దత్త పీఠాలను పవన్‌ దర్శించుకుంటారు.

భారీ ఆధిక్యంతో గెలిపిస్తాం: వర్మ

తనకంటే పది రెట్ల ఆధిక్యంతో పవన్‌కల్యాణ్‌ను గెలిపిస్తామని తెదేపా అధినేత చంద్రబాబుకు మాట ఇచ్చానని ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తెలిపారు. పవన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత భారీ మెజారిటీతో గెలిచేలా కూటమి సభ్యులంతా కసిగా పనిచేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు