రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వైకాపా

‘వైకాపా నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. దోచుకున్న దాంట్లో కొంచెం ప్రజలకు పంచిపెట్టి మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తున్నారు.

Published : 31 Mar 2024 05:36 IST

గుత్తేదారు నుంచి దోపిడీదారుగా మారిన మంత్రి పెద్దిరెడ్డి
రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

కలికిరి గ్రామీణ, మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ‘వైకాపా నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. దోచుకున్న దాంట్లో కొంచెం ప్రజలకు పంచిపెట్టి మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తున్నారు. ఓటర్లు మనందరికన్నా తెలివైన వారు. కానుకలు, డబ్బులకు లొంగి ఓట్లు వేసే పరిస్థితులు లేవు. ఈసారి వైకాపాకు కచ్చితంగా గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపుతారు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి శనివారం అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ఆయనకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో భాజపా, తెదేపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, కలికిరిలో రోడ్‌షోలలో ఆయన పాల్గొన్నారు. కలికిరిలో విలేకర్లతో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ చిన్నస్థాయి గుత్తేదారు నుంచి రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజాధనాన్ని లూటీ చేశారని ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదుకు పురిగొల్పిన ప్రధాన సూత్రధారి ఎవరన్నదానిపై ఎన్నికల కమిషన్‌ సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమి అభ్యర్థులు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, షాజహాన్‌బాషా, రాంప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని