అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు.

Published : 31 Mar 2024 05:36 IST

మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం
ఇంట్లో ఉన్న అర్హులందరికీ పింఛను
9 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
జగన్‌ మోసాల్ని జనంలోకి తీసుకెళ్లాలని పిలుపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష ఇస్తామని ఆమె వెల్లడించారు. ‘గడప గడపకు కాంగ్రెస్‌’ ప్రచార కార్యక్రమాన్ని షర్మిల విజయవాడలో శనివారం ప్రారంభించి, 9 గ్యారంటీలను ప్రకటించారు. సీఎం జగన్‌ ప్రత్యేకహోదా తెస్తానని రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. భాజపాతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన జగన్‌ మోసాలను ప్రజలకు వివరించాలని షర్మిల కార్యకర్తలకు సూచించారు. ‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి  మేలు చేయకపోయినా.. జగన్‌, చంద్రబాబు ఆ పార్టీకి బానిసలుగా మారారు. విభజన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. ప్రత్యేకహోదా ఊసే లేదు. ప్రధాని మోదీకి జగన్‌ దత్తపుత్రుడని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే అన్నారు. జగన్‌, చంద్రబాబులకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. భాజపా అంటే.. బాబు, జగన్‌, పవన్‌ అని తెలియజేయాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం’ అని షర్మిల అన్నారు. ‘కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన 1,500 దరఖాస్తులపై సర్వేలు చేశాం. అభ్యర్థి పనితీరు, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నాం. టికెట్లు రానివారు కాంగ్రెస్‌ గెలుపునకు శ్రమించకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఎందుకంటే కాంగ్రెస్‌ దేశంలో అధికారంలోకి రాకపోతే మణిపుర్‌ లాంటి ఘటనలే పునరావృతమవుతాయి’ అని పేర్కొన్నారు.

1న అభ్యర్థుల జాబితా: రఘువీరారెడ్డి

ఏప్రిల్‌ 1న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని, టికెట్‌ ఎవరికి వచ్చినా విజయానికి మిగిలిన వారంతా కృషిచేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీల ద్వారా కర్ణాటక, తెలంగాణల్లో మంచి ఫలితాలొచ్చాయని.. పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ మరో సభ్యుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మేయప్పన్‌, ఎన్నికల పరిశీలకులు శంకర్‌, మనోజ్‌ చౌహాన్‌, కేంద్ర మాజీమంత్రులు జేడీ శీలం, పళ్లంరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలీ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జంగా గౌతమ్‌, సుంకర పద్మశ్రీ తదితరులు మాట్లాడారు.

ఇవీ 9 గ్యారంటీలు

  • అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా
  • పెట్టుబడిపై 50% లాభంతో రైతులకు మద్దతు ధర
  • రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
  • మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష
  • ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400
  • కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం
  • ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరుమీద రూ.5 లక్షలతో పక్కా ఇల్లు
  • ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పింఛను. అర్హులైన వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని